Bill Gates: కార్లు, మందుల తరహాలో ఏఐకి నియంత్రణలు అవసరం.. బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కార్లు, విమానాలు, మందుల విషయంలో అమలు చేస్తున్నట్లుగానే ఏఐపైనా కఠినమైన నియంత్రణలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఏఐలో ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకుంటూనే, దాని వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించేందుకు తగిన భద్రతా చర్యలు అవసరమని పేర్కొన్నారు. కార్లు, విమానాలు, మందులపై ఎలాగైతే నియంత్రణలు ఉన్నాయో.. ఏఐకీ అలాంటి నియమాలు ఉండాలని బిల్ గేట్స్ తన పోస్టులో తెలిపారు.
వివరాలు
దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో ఏఐ నియంత్రణలు కీలకం
ఏఐ వల్ల తలెత్తే అన్ని ప్రమాదాలను నియంత్రణలు పూర్తిగా అడ్డుకోలేకపోవచ్చని బిల్ గేట్స్ అంగీకరించారు.
అయితే, ఈ సాంకేతికతను దురుద్దేశంతో ఉపయోగించే వ్యక్తుల నుంచి సమాజాన్ని రక్షించడంలో ఇవి సహాయపడతాయని చెప్పారు.
ఏఐ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు తగిన నియంత్రణలు అవసరమని స్పష్టం చేశారు.
వేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధస్సు వల్ల ఎదురయ్యే ముప్పులను తగ్గించడంలో ప్రభుత్వాలు, సంబంధిత సంస్థలు తీసుకునే చర్యలు కీలకమని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
వివరాలు
ఏఐతో ప్రపంచం అంతమవుతుందనే భయాలు అతిశయోక్తి కావొచ్చు
ఏఐ వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయనే భయాలపై కూడా బిల్ గేట్స్ స్పందించారు.
ఏఐతో ముడిపడిన కొన్ని ప్రతికూల పరిణామాల గురించి చేస్తున్న ప్రచారం అతిగా ఉండొచ్చని అన్నారు.
ఈ విషయాన్ని సీఎన్‌ఎన్‌తో మాట్లాడుతూ వెల్లడించారు. అయితే, కార్లు లేదా మందుల వంటి ఇప్పటికే నియంత్రణలు ఉన్న రంగాలతో పోలిస్తే ఏఐ వల్ల మరింత తీవ్రమైన ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని కూడా ఆయన అంగీకరించారు.
అందువల్ల ఏఐపై వచ్చే భయాలన్నింటినీ కొట్టిపారేయకుండా, వాస్తవమైన ప్రమాదాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
వివరాలు
ఏఐ భద్రతపై మధ్యేమార్గం అవసరం
ఏఐ భద్రత విషయంలో అతిగా ఆంక్షలు విధించకుండా, అదే సమయంలో ప్రమాదాలను నిర్లక్ష్యం చేయకుండా మధ్యేమార్గాన్ని అనుసరించాలని బిల్ గేట్స్ సూచించారు.
ఏఐపై నియంత్రణను కొనసాగించడంలో విఫలమైతే కొన్ని తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ వ్యాఖ్యలు ఏఐ భవిష్యత్తుపై సాంకేతిక రంగంలో కొనసాగుతున్న చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి.
ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐ వంటి సంస్థలు ఏఐపై నియంత్రణలకు మద్దతు తెలుపుతుండగా, మెటా, ఎన్విడియా వంటి సంస్థలు ఈ విషయంలో భిన్నమైన వైఖరిని అనుసరిస్తున్నాయి.
ఏఐ అభివృద్ధి వేగంగా సాగుతున్న నేపథ్యంలో దాని వినియోగానికి ఎలాంటి నియమాలు ఉండాలనే అంశంపై పరిశ్రమలో చర్చ కొనసాగుతోంది.
వివరాలు
ఏఐ నియంత్రణలకు మద్దతుగా మైక్రోసాఫ్ట్ నాయకత్వం
ఏఐపై నియంత్రణలు అవసరమన్న గేట్స్ అభిప్రాయంతో మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, సీఈఓ సత్య నాదెళ్ల కూడా ఏకీభవించారు.
రోజువారీ జీవితంలో ఉపయోగించే వాషింగ్ మెషీన్లు,పాల ప్యాకెట్ల వంటి ఉత్పత్తులతో పోలిస్తే ఏఐపై నియంత్రణలు తక్కువగా ఉన్నాయని బ్రాడ్ స్మిత్ పేర్కొన్నారు.
ఈసాంకేతికతకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అమలు చేయగలిగే నియమాలను రూపొందించాలని కోరారు.
ఇందుకోసం ఇప్పుడే చర్యలు ప్రారంభించాలని పిలుపునిచ్చారు.మరోవైపు,శక్తిమంతమైన ఏఐ మోడళ్లను గుడ్డిగా నమ్మకూడదని సత్య నాదెళ్ల హెచ్చరించారు.
ముఖ్యంగా మన వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసే ఏఐ వ్యవస్థల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మొదటి నుంచే వాటి భద్రతపై పూర్తి నమ్మకంతో వ్యవహరించకుండా,వాటి ద్వారా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని భావించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.