Global Pandemic: కరోనా తర్వాత ప్రపంచ మహమ్మారిపై శాస్త్రవేత్తల రీసెర్చ్.. తర్వాత ప్రపంచాన్ని కలవరపెట్టే ''మహమ్మారి'' ఇదేనా..?
కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించిన విషయం అందరికీ తెలిసిందే. 2019 నుంచి రెండేళ్ల పాటు ప్రపంచ దేశాలు ఊహించని రీతిలో ''లాక్‌డౌన్''లోకి వెళ్లి, లక్షల మంది ప్రాణాలు కోల్పోయి, కోట్లలో కేసులు నమోదయ్యాయి. కరోనా తన రూపాన్ని మార్చుకుంటూ ఇప్పటికీ ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇప్పుడు,కరోనా తర్వాత మరొక మహమ్మారి వస్తుందా? అనే ప్రశ్న సాధారణ ప్రజలతో పాటు శాస్త్రవేత్తలను కూడా ఆలోచనలో పడేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం,''బర్డ్ ఫ్లూ''అనేది తదుపరి ప్రపంచ మహమ్మారి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ యునైటెడ్ స్టేట్స్‌లో జంతువులలో వేగంగా వ్యాపిస్తోంది. ఇది మానవుల మధ్య సంక్రమించే ప్రమాదంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
పక్షులు, ఫౌల్ట్రీ లేదా కలుషిత పరిసరాల ద్వారా మానవులకు సంక్రమణ
తాజా పరిశోధనల ప్రకారం, ఈ వైరస్ మానవుల మధ్య వ్యాప్తి చెందేందుకు కేవలం ఒకే ఒక్క మ్యుటేషన్ అవసరమని అంచనా. H5N1 అనేది అత్యంత ప్రాణాంతకమైన వైరస్, ఇది సోకిన వారిలో 50% మరణాల రేటును కలిగిస్తుంది. ఈ వైరస్‌ను నియంత్రించేందుకు,దాని పరివర్తనను ఆపటానికి,జంతువుల ఇన్‌ఫెక్షన్లను క్షుణ్ణంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. సాధారణంగా,బర్డ్ ఫ్లూ మానవులకు ముప్పుగా మారేందుకు అనేక మ్యుటేషన్లు అవసరం.కానీ, స్క్రిప్స్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తల ప్రకారం,ఈ వైరస్ వేగంగా పరివర్తన చెందుతూ గ్లోబల్ పాండమిక్‌గా మారే అవకాశాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం, మానవుల మధ్య H5N1 సంక్రమణ కేసులు లేవు, కానీ పక్షులు, ఫౌల్ట్రీ లేదా కలుషిత పరిసరాల ద్వారా మానవులకు సంక్రమణ చెందుతున్నట్టు గుర్తించారు.
పరిస్థితిని నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు కృషి
ఫ్లూ వైరస్‌లు సాధారణంగా జంతువుల హేమాగ్గ్లుటినిన్ అనే ప్రోటీన్ ద్వారా హోస్ట్ కణాల్లోని గ్లైకాన్ గ్రాహకాలతో బంధింపబడతాయి. H5N1 వంటి ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్‌లు పక్షుల్లో కనిపించే ప్రత్యేక గ్రాహకాల ద్వారా వ్యాపిస్తాయి. అయితే, ఇవి మానవుల గ్లైకాన్ గ్రాహకాలను గుర్తించగల సామర్థ్యం కలిగిస్తే, మానవుల మధ్య వ్యాప్తి చెందే అవకాశాలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.