Black Friday scam alert: బ్లాక్ ఫ్రైడే స్కామ్ అలర్ట్! అమెజాన్, శాంసంగ్ పేరుతో 2,000కిపైగా నకిలీ సైట్లు
ఈ వార్తాకథనం ఏంటి
హాలిడే షాపింగ్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో, బ్లాక్ ఫ్రైడే ఆఫర్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఆన్‌లైన్ దుకాణాలు పెరిగిపోతున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ CloudSEK తాజా నివేదిక హెచ్చరించింది. అమెజాన్, శాంసంగ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లను పోలి ఉండేలా దాదాపు 2,000 కంటే ఎక్కువ హాలిడే-థీమ్ ఫేక్ వెబ్‌సైట్లను మోసగాళ్లు తయారు చేసినట్టు వెల్లడించారు. ఈ నకిలీ స్టోర్లు అసలు బ్రాండ్‌ల ఆకృతులను కాపీ చేసి, పాత హాలిడే డిజైన్లు, కౌంట్‌డౌన్ టైమర్లు, ఫేక్ ట్రస్ట్ బ్యాడ్జ్‌లు, పాప్‌అప్స్ వంటివి ఉపయోగించి వినియోగదారుల్లో తొందరపాటు భావన కలిగించే ప్రయత్నం చేస్తాయి. డబ్బులు చెల్లించే సమయంలో యూజర్‌లను దారి మళ్లించి, హ్యాకర్‌లు నియంత్రించే చెక్అవుట్ పేజీల్లో వివరాల్ని సేకరించి మోసం చేస్తారు.
వివరాలు
వాట్సాప్,టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కూడా ఈ నకిలీ లింకులు
CloudSEK పేర్కొన్న రెండు పెద్ద స్కామ్ క్లస్టర్లలో మొదటి క్లస్టర్‌లోనే 750కి పైగా ఫేక్ స్టోర్లు,అందులో 170కి పైగా అమెజాన్ పేరుతో కనిపించే టైపోస్క్వాటెడ్ డొమైన్లు ఉన్నట్టు గుర్తించారు. రెండో క్లస్టర్‌లో .shop ఎక్స్‌టెన్షన్‌తో రిజిస్ట్రేషన్ చేసుకున్న 1,000కు పైగా ఫేక్ సైట్లు ఉండగా,ఇవి సామ్‌సంగ్, జో మలోన్,రే-బ్యాన్,షియోమీ తదితర బ్రాండ్‌లను అనుకరించేలా ఉంటాయి. ఇవన్నీ ఒకే విధంగా రూపొందించిన బ్లాక్ ఫ్రైడే/సైబర్ మండే లేఅవుట్‌ను ఉపయోగిస్తూ,అదే రకమైన స్కామ్ చెక్అవుట్ విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవి పెద్ద స్థాయిలో తయారు చేసిన ఫిషింగ్ కిట్ భాగమని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియా యాడ్స్,సెర్చ్ మానిప్యులేషన్‌తో పాటు వాట్సాప్,టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా కూడా ఈ నకిలీ లింకులు షేర్ చేస్తున్నట్టు విశ్లేషణలో తేలింది.
వివరాలు
వినియోగదారులు వారి ద్వారా మాత్రమే షాపింగ్ చేయాలి
ఒక్కో ఫేక్ స్టోర్ కొద్దిసమయంలోనే వందల్లో విజిటర్లను లాగి 3%-8% వరకు వారిని మోసగాళ్ల ఉచ్చులో పడేసే అవకాశం ఉందని నిపుణుల అంచనా. భారీ తగ్గింపులు, స్పెల్లింగ్ తప్పులున్న URLs, ఫేక్ సీల్స్, తెలియని డొమైన్‌కి దారి తీసే చెక్అవుట్ పేజీలు, అన్ని స్టోర్లలో ఒకే లేఅవుట్, అసలైన కస్టమర్ సపోర్ట్ లాంటి వివరాలు లేకపోవడం.. ఇవన్నీ నకిలీ సైట్ల లక్షణాలుగా చెబుతున్నారు. వినియోగదారులు తప్పనిసరిగా అధికారిక వెబ్‌సైట్లు లేదా విశ్వసనీయ రిటైలర్లు ద్వారా మాత్రమే షాపింగ్ చేయాలని సూచిస్తున్నారు.
వివరాలు
నకిలీ ప్రయత్నాలను త్వరగా తొలగించే చర్యలు చేపట్టాలని CloudSEK సూచన
మరోవైపు, రిటైల్, ఎలక్ట్రానిక్స్, బ్యూటీ, లైఫ్‌స్టైల్ రంగాల బ్రాండ్‌లు కొత్త డొమైన్ రిజిస్ట్రేషన్లను క్రమం తప్పకుండా గమనించి, నకిలీ ప్రయత్నాలను త్వరగా తొలగించే చర్యలు చేపట్టాలని CloudSEK సూచించింది. అలాగే, రెగ్యులేటరీ సంస్థలు హై-రిస్క్ హోస్టింగ్ నెట్‌వర్క్‌లపై మరింత కంట్రోల్ పెట్టి, యాడ్ ప్లాట్‌ఫారమ్‌లతో కలిసి స్కామ్ క్యాంపెయిన్‌లను అడ్డుకుని, ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది.