LOADING...
Blood Fall: మంచు కొండల మధ్య రక్తధారలు.. ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రకృతి రహస్యం
మంచు కొండల మధ్య రక్తధారలు.. ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రకృతి రహస్యం

Blood Fall: మంచు కొండల మధ్య రక్తధారలు.. ప్రపంచాన్ని భయపెడుతున్న ప్రకృతి రహస్యం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2026
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంటార్కిటికా అనే పేరు వినగానే అంతులేని మంచు, నిశ్శబ్దం గుర్తుకొస్తాయి. కానీ ఆ తెల్లటి ప్రపంచం మధ్యలో ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. అక్కడ ఒక హిమనది నుంచి మంచు రక్తంలా కారుతుంది. టేలర్ గ్లేసియర్ మధ్య నుంచి ఎర్రటి నీరు నెమ్మదిగా బయటకు జారుతూ కనిపిస్తుంది. ఈ విచిత్ర దృశ్యాన్ని ప్రపంచం 'బ్లడ్ ఫాల్స్' పేరుతో తెలుసుకుంది. 1911లో మొదటిసారి ఈ ఎర్రటి జలధారను గుర్తించినప్పటి నుంచి ఇది శాస్త్రవేత్తలకు ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఎప్పటికీ గడ్డకట్టే అంటార్కిటికాలో నీరు ఎలా ప్రవహిస్తోంది? అదీ ఇంత ఎర్రటి రంగులో ఎందుకు ఉంది? ఇన్ని సంవత్సరాలు గడిచినా, బ్లడ్ ఫాల్స్ ప్రపంచంలోని అత్యంత భయానక ప్రకృతి రహస్యాల్లో ఒకటిగా నిలిచింది.

Details

పూర్తిగా మంచుతో నిండిపోయిన సరస్సు

టేలర్ గ్లేసియర్ నుంచి కారుతున్న ఆ నీటిని చూసినవారికి అది నిజంగా రక్తంలా అనిపిస్తుంది.అందుకే దీనికి బ్లడ్ ఫాల్స్ అనే పేరు వచ్చింది. కానీ అది రక్తం కాదు. ఇది సాధారణ జలపాతం కూడా కాదు. వేలాది ఏళ్లుగా మంచు కింద దాగి ఉన్న ఒక ప్రత్యేకమైన ద్రవ ప్రపంచం బయటకు వస్తున్న సంకేతమే ఇది. టేలర్ గ్లేసియర్ లోతుల్లో, లక్షల సంవత్సరాల క్రితం ఒక సరస్సు ఏర్పడింది. కాలక్రమంలో వాతావరణ మార్పులు, మంచు కదలికల కారణంగా ఆ సరస్సు పూర్తిగా మంచుతో మూసుకుపోయింది. సూర్యకాంతి చేరని, గాలితో ఎలాంటి సంబంధం లేని ఒక చీకటి లోకం అక్కడ ఏర్పడింది. బయటకు రావడానికి మార్గం లేకుండా ఆ నీరు మంచు లోపలే బంధించబడింది.

Details

ఆ సరస్సులో ఉన్న నీరు సాధారణ నీరు కాదు

ఆ సరస్సులో ఉన్న నీరు సాధారణ నీరు కాదు. అది అత్యంత ఉప్పు కలిగిన బ్రైన్. సముద్రపు నీటికంటే మూడింతలు ఎక్కువ ఉప్పు ఉండటంతో, అంటార్కిటికాలోని తీవ్ర మైనస్ ఉష్ణోగ్రతల్లో కూడా అది గడ్డకట్టలేదు. సంవత్సరాలు గడిచేకొద్దీ గ్లేసియర్ లోపల ఒత్తిడి పెరిగింది. చివరికి మంచులో ఏర్పడిన చిన్న చిన్న చీలికల ద్వారా ఆ నీరు నెమ్మదిగా బయటకు జారడం మొదలైంది. అప్పుడే ప్రపంచం చూసింది... తెల్లటి మంచు మీద ఎర్రటి మరకలను. ఆ నీటికి కనిపించే ఎరుపు రంగుకు అసలు కారణం ఇనుము. వేల సంవత్సరాల పాటు ఆ నీరు ఆక్సిజన్‌ను చూడకుండా మంచు కిందనే ఉంది. అప్పుడు అందులోని ఇనుము రసాయనికంగా స్థిరంగా ఉంది.

Advertisement

Details

  కారుతున్న రక్తంలా కనిపిస్తుంది

కానీ ఆ నీరు బయటకు వచ్చి గాలిని తాకిన వెంటనే, ఇనుము ఆక్సిడేషన్‌కు గురైంది. ఇదే ప్రక్రియ ఇనుము తుప్పు పట్టినప్పుడు జరుగుతుంది. ఈ ఆక్సిడేషన్ వల్ల నీరు ఒక్కసారిగా ఎర్రగా మారింది. అందుకే అది మంచు మీద కారుతున్న రక్తంలా కనిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ నీటిలో శాస్త్రవేత్తలు సూక్ష్మజీవులను కూడా గుర్తించారు. అవి సూర్యకాంతి లేకుండా, ఆక్సిజన్ లేకుండా జీవిస్తున్నాయి. ఇనుము, సల్ఫర్ వంటి ఖనిజాలను ఉపయోగించుకొని అవి శక్తిని పొందుతున్నాయి. దీంతో భూమిపై జీవం ఉండాలంటే తప్పనిసరిగా వెలుగు కావాలన్న మన అంచనాలు పూర్తిగా కూలిపోయాయి.

Advertisement

Details

నిజానికి బ్లడ్ ఫాల్స్ మనకు ముప్పు కాదు

ఈ కనుగొనడం వల్ల మంగళగ్రహం లాంటి గ్రహాల్లో లేదా జూపిటర్ ఉపగ్రహాల లోతుల్లో కూడా జీవం ఉండే అవకాశాలపై శాస్త్రవేత్తలు కొత్తగా ఆలోచించడం ప్రారంభించారు. నిజానికి బ్లడ్ ఫాల్స్ మనకు ముప్పు కాదు. కానీ భూమి లోపల ఇంకా మనకు తెలియని ఎన్నో ప్రపంచాలు ఉన్నాయని ఇది గుర్తుచేస్తుంది. బయటకు ప్రశాంతంగా కనిపించే మంచు కింద, వేల సంవత్సరాలుగా జీవం తనదైన మార్గంలో కొనసాగుతూనే ఉందని ఇది చెబుతోంది ఒకప్పుడు భయానకంగా అనిపించిన ఈ ఎర్రటి జలధార, ఇప్పుడు శాస్త్రానికి ఒక గొప్ప తలుపు తెరిచింది. అంటార్కిటికా మంచులో కారుతున్న ఆ ఎర్రటి నీరు, మనకు తెలియని ఈ పుడమి తల్లి కథలను నెమ్మదిగా బయటకు చెబుతోంది.

Advertisement