Bloomberg: బ్లూమ్‌బర్గ్ టెర్మినల్‌కు AI చాట్‌బాట్.. 'ASKB'తో డేటా విశ్లేషణ సులువు
ఈ వార్తాకథనం ఏంటి
బ్లూమ్‌బెర్గ్ తన టెర్మినల్‌ను మరింత స్మార్ట్‌గా మార్చే దిశగా కీలక అడుగు వేసింది. 'ASKB' (ఆస్క్-బీ) అనే AI చాట్‌బాట్ తరహా ఇంటర్‌ఫేస్‌ను తీసుకురావడానికి సంస్థ సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌లో ఆదాయాలు, ఆస్తి ధరలు, వాతావరణ సమాచారం, వినియోగదారుల ఖర్చుల వంటి భారీ డేటా ఉండటంతో అవసరమైన సమాచారాన్ని త్వరగా కనుగొనడం కష్టంగా మారిందని CTO షాన్ ఎడ్వర్డ్స్ తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారంగా ASKBను రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం సుమారు 1.25 లక్షల టెర్మినల్ యూజర్లపై ఈ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారు. ఈ కొత్త టూల్ ద్వారా ఫైనాన్స్ రంగ నిపుణులు సహజ భాషలో ప్రశ్నలు అడిగి డేటా నుంచి కీలక అంశాలను తెలుసుకోవచ్చు.
వివరాలు
జూనియర్ అనలిస్టులు చేసే కొన్ని సాధారణ పనులను ASKB ఆటోమేట్ చేసే అవకాశం
"ఇరాన్ యుద్ధం, చమురు ధరల మార్పులు నా పెట్టుబడులపై ఎలా ప్రభావం చూపుతాయి?" వంటి పెద్ద ప్రశ్నలకు కూడా సమాధానాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ ఉద్యోగిని నిపుణుడిగా మార్చకపోయినా,ఇప్పటికే ఉన్న నిపుణులు మరింత లోతైన విశ్లేషణ చేయడానికి సహాయపడుతుందని ఎడ్వర్డ్స్ చెప్పారు. అంతేకాదు,జూనియర్ అనలిస్టులు చేసే కొన్ని సాధారణ పనులను కూడా ASKB ఆటోమేట్ చేసే అవకాశముంది. వర్క్‌ఫ్లోలను సెట్ చేసి, మార్కెట్ పరిస్థితులు మారినప్పుడు ఆటోమేటిక్‌గా విశ్లేషణలు,సమరీలు పొందే విధంగా రూపొందిస్తున్నారు. అయితే AI ఇచ్చే సమాచారం మీద పూర్తిగా ఆధారపడకూడదని,ఫైనాన్స్ రంగంలో సరైన అవగాహన చాలా ముఖ్యమని ఎడ్వర్డ్స్ హెచ్చరించారు. తప్పు సమాచారం ఆధారంగా తీసుకునే నిర్ణయాలు పెద్ద నష్టాలకు దారి తీసే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
వివరాలు
తప్పుదారి పట్టించే సమాచారం తగ్గించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు
ఇక ASKBలో తప్పుదారి పట్టించే సమాచారం (హాల్యూసినేషన్స్) తగ్గించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రతి దశలో వాలిడేషన్ చెక్స్ పెట్టి, సమరీలోని సమాచారం అసలు డేటాతో సరిపోతుందో లేదో పరిశీలించే విధంగా సిస్టమ్‌ను రూపొందిస్తున్నామని చెప్పారు.