WhatsApp: బాస్ వాట్సాప్ మెసేజ్‌లకు చెక్ పెట్టిన డెవలపర్… బ్లూ టిక్స్ పడకుండా చదివే స్మార్ట్ ట్రిక్
ఈ వార్తాకథనం ఏంటి
బాస్ నుంచి వాట్సాప్‌లో ఆగకుండా మెసేజ్‌లు వస్తుంటే తట్టుకోలేక, ఓ భారతీయ డెవలపర్ తెలివైన పరిష్కారాన్ని రూపొందించాడు. వాట్సాప్‌లో బ్లూ టిక్స్ పడకుండా, మెసేజ్‌లను నిశ్శబ్దంగా చదివే విధానాన్ని అతడు తయారు చేయడం ఇప్పుడు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. r/developersIndia అనే రెడిట్ గ్రూప్‌లో Several-Virus4840 అనే యూజర్ పెట్టిన పోస్ట్‌కు మంచి స్పందన వచ్చింది. పని ఒత్తిడితో పాటు బాస్ నుంచి ఎప్పటికప్పుడు వచ్చే పొడవైన వాట్సాప్ మెసేజ్‌లు మానసికంగా అలసట తెస్తున్నాయని అతడు వివరించాడు. ప్రతిసారి మెసేజ్ ఓపెన్ చేయడం ఇష్టం లేకపోవడం, అలాగే చదివామని బాస్‌కు తెలియకూడదనుకోవడం వల్లే ఈ ఐడియా వచ్చిందని చెప్పాడు.
వివరాలు
"whatsNot"అనే చిన్న సైడ్ ప్రాజెక్ట్
నోటిఫికేషన్లు మ్యూట్ చేయడం లేదా మెసేజ్‌లను పూర్తిగా పట్టించుకోకపోవడానికి బదులు,అతడు ఒక టెక్నికల్ మార్గాన్ని ఎంచుకున్నాడు. అందులో భాగంగా"whatsNot"అనే చిన్న సైడ్ ప్రాజెక్ట్‌ను రూపొందించాడు. ఇది వాట్సాప్ మెసేజ్‌లను ఓపెన్ చేయకుండానే చదివి, వాటిని సారాంశంగా చూపిస్తుంది. ఈ సెటప్‌లో ప్రధానంగా Node.js సర్వీస్ పనిచేస్తుంది.Baileys అనే ఓపెన్-సోర్స్ లైబ్రరీని ఉపయోగించి, వాట్సాప్ వెబ్ ద్వారా వచ్చే మెసేజ్‌లను ఇది క్యాచ్ చేస్తుంది. కొత్త మెసేజ్ వచ్చిన వెంటనే,ఒక సింపుల్ HTTP సర్వర్ ద్వారా ఆ సమాచారం ప్రాసెస్ అవుతుంది. ఆ తర్వాత మెసేజ్ టెక్స్ట్‌ను ఉచితంగా లభించే Grok లార్జ్ లాంగ్వేజ్ మోడల్ APIకి పంపిస్తారు. ఈ ఏఐ రెండు పనులు చేస్తుంది. ఒకటి, పొడవైన మెసేజ్‌ను చిన్నగా,అర్థమయ్యేలా సమరీ చేస్తుంది.
వివరాలు
టచ్ సెన్సర్ కూడా ఏర్పాటు
రెండోది, ఆ మెసేజ్ టోన్ ఎలా ఉందో విశ్లేషిస్తుంది. అది అత్యవసరమా, సాధారణమా, కాస్త ఆగ్రెసివ్‌గా ఉందా అన్నది స్పష్టంగా చూపిస్తుంది. దీంతో వెంటనే స్పందించాలా, తర్వాత చూసినా సరిపోతుందా అన్నది యూజర్ నిర్ణయించుకోవచ్చు. సమరీ రెడీ అయిన తర్వాత హార్డ్‌వేర్ భాగం పని మొదలుపెడుతుంది. NodeMCU మైక్రోకంట్రోలర్ సర్వర్‌ను తరచూ చెక్ చేసి,కొత్త సమరీలు ఉంటే వాటిని చిన్న OLED స్క్రీన్‌పై చూపిస్తుంది. స్క్రీన్ రిఫ్రెష్ చేయడానికి లేదా పొడవైన సమరీలు స్క్రోల్ చేయడానికి టచ్ సెన్సర్ కూడా ఏర్పాటు చేశారు. ఈ డివైస్ మొత్తం చాలా సింపుల్‌గా,తాత్కాలికంగా తయారు చేశారు. NodeMCU,చిన్న OLED డిస్‌ప్లే, టచ్ సెన్సర్ అన్నినేరుగా కలిపేశారు.
వివరాలు
"సీన్" సిగ్నల్ వాట్సాప్ సర్వర్లకు వెళ్లదు
పవర్ కోసం పాత సెల్ఫీ స్టిక్‌లో ఉన్న చిన్న బ్యాటరీని వాడారు. దీంతో ఇది ఫోన్‌కు ఆధారపడకుండా ఎక్కడైనా ఉపయోగించుకునేలా మారింది. ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ సెటప్ ఎప్పుడూ వాట్సాప్ చాట్‌ను నేరుగా ఓపెన్ చేయదు. అందువల్ల "సీన్" సిగ్నల్ వాట్సాప్ సర్వర్లకు వెళ్లదు.బ్లూ టిక్స్ యాప్ ఇంటర్‌ఫేస్ లెవెల్‌లోనే ట్రిగ్గర్ అవుతాయన్న విషయాన్ని ఈ డెవలపర్ బాగా ఉపయోగించుకున్నాడు. ఇది ఎలాంటి కమర్షియల్ ప్రొడక్ట్ కాదని ఆ డెవలపర్ స్పష్టంగా చెప్పాడు. ఆధునిక కార్యాలయ కమ్యూనికేషన్ ఒత్తిడిని తట్టుకోవడానికి సరదాగా,ప్రాక్టికల్‌గా చేసిన ప్రయత్నమేనని తెలిపాడు. అయినా,ఈ పోస్ట్‌కు వచ్చిన స్పందన చూస్తే, చిన్న చిన్న ఏఐ టూల్స్‌తో మనుషుల నిజమైన సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్న డెవలపర్లు ఎంతమందో ఉన్నారని అర్థమవుతోంది.