LOADING...
Google: నకిలీ 'పెన్సిల్ ప్యాకింగ్' ఉద్యోగ మోసం.. 15 గూగుల్ ప్రకటన పేజీలపై కేంద్రం చర్యలు
15 గూగుల్ ప్రకటన పేజీలపై కేంద్రం చర్యలు

Google: నకిలీ 'పెన్సిల్ ప్యాకింగ్' ఉద్యోగ మోసం.. 15 గూగుల్ ప్రకటన పేజీలపై కేంద్రం చర్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2025
02:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (I4C), నకిలీ "పెన్సిల్ ప్యాకింగ్" వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ స్కీమ్‌ను ప్రమోట్ చేస్తున్నట్లు గుర్తించిన 15 ప్రకటనదారుల పేజీలను తొలగించాలని గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 28 తేదీతో జారీ చేసిన ఈ నోటీసు ప్రకారం, గూగుల్ అడ్స్ ట్రాన్స్‌పరెన్సీ లైబ్రరీ ద్వారా గుర్తించిన ఈ ప్రకటనలు హిందుస్తాన్ పెన్సిల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నకిలీగా ప్రచారం చేస్తూ, నెలకు రూ.30,000 నుంచి రూ.40,000 వరకు ఆదాయం వస్తుందని తప్పుడు హామీలు ఇస్తున్నట్లు పేర్కొంది. ఈ ప్రకటనలు పూర్తిగా నకిలీవి కావడంతో ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతోనే రూపొందించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

వివరాలు 

ప్రజలను మభ్యపెట్టేలా మోసాలకు పాల్పడుతున్నారని I4C స్పష్టం

ఇవి ఐటీ చట్టం-2000తో పాటు భారతీయ న్యాయ సంహితలోని కొన్ని విభాగాలను ఉల్లంఘిస్తున్నాయని తెలిపింది. ఐటీ చట్టం సెక్షన్ 79(3)(b), ఐటీ రూల్స్ రూల్ 3(1)(d) ప్రకారం ప్రభుత్వ సంస్థలు తెలియజేసిన వెంటనే మధ్యవర్తి సంస్థలు ఇలాంటి అక్రమ కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుందని, అందుకే గూగుల్ 36 గంటల్లోపు నోటీసులో సూచించిన యూఆర్ఎల్‌లకు యాక్సెస్ నిలిపివేయాలని ఆదేశించింది. ప్రజలను మభ్యపెట్టేలా ఇతరుల పేరు వాడుకుంటూ నకిలీ ప్రకటనలు ఇస్తూ, డబ్బుల మోసాలకు పాల్పడుతున్నారని I4C స్పష్టం చేసింది. పేరుప్రఖ్యాతిగాంచిన దేశీయ కంపెనీ పేరును ఉపయోగించి అసాధ్యమైన ఆదాయం వస్తుందని ప్రచారం చేయడం వల్ల ప్రకటనలకు స్పందించిన వారికి ఆర్థిక నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

వివరాలు 

ప్రకటన పేజీల స్క్రీన్‌షాట్లను నోటీసుతో పాటు జతచేశారు

సంబంధిత ప్రకటన పేజీల స్క్రీన్‌షాట్లను నోటీసుతో పాటు జతచేశారు. ప్రకటనలు, ప్రమోషన్ వేదికలను అక్రమంగా వినియోగిస్తూ జరుగుతున్న సైబర్ నేరాలపై దర్యాప్తు వేగమందుకున్న ఈ సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో సోషల్ మీడియాలోనే ఎక్కువగా ఉద్యోగ మోసాలు జరగగా, ఇప్పుడు చెల్లింపు ప్రకటనల ద్వారానూ పెద్ద సంఖ్యలో ప్రజలను చేరుకుంటున్నట్లు ఈ కేసు స్పష్టం చేసింది. ఈ అంశంపై గూగుల్‌ను మనీకంట్రోల్ సంప్రదించగా, వారి స్పందన వచ్చిన వెంటనే కథనాన్ని నవీకరిస్తామని తెలిపింది.

Advertisement

వివరాలు 

డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ అంతకుమించిన హోదా ఉన్నవారే టేక్‌డౌన్ నోటీసులు జారీ చేయాలి 

ఐటీ చట్టం సెక్షన్ 79(3)(b) కింద జారీ అయ్యే టేక్‌డౌన్ నోటీసులను వేదికలు పాటించకపోతే, మూడో వ్యక్తులు పెట్టే కంటెంట్‌కు రక్షణగా ఉన్న 'సేఫ్ హార్బర్' హక్కును కోల్పోయే ప్రమాదముందని అధికారులు హెచ్చరించారు. ఇటీవల ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుని, జాయింట్ సెక్రటరీ హోదా లేదా అంతకు పై స్థాయి అధికారులు మాత్రమే, అలాగే చట్ట అమలు సంస్థలలో డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ లేదా అంతకుమించిన హోదా ఉన్నవారే టేక్‌డౌన్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. దీని వల్ల గతంలో సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులు కూడా నోటీసులు పంపే విధానం ఇక రద్దయింది.

Advertisement