Antiproton: సెర్న్ వినూత్న ప్రయోగం.. ట్రక్కులో యాంటీప్రొటాన్ల రవాణా విజయవంతం
ఈ వార్తాకథనం ఏంటి
ఐరోపా అణు పరిశోధన సంస్థ సెర్న్ (CERN) శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే తొలిసారిగా వినూత్న ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. యాంటీప్రొటాన్లను ట్రక్కు ద్వారా రవాణా చేసే ప్రక్రియను పరీక్షించి కీలక ముందడుగు వేశారు. యాంటీప్రొటాన్ వంటి ప్రతిపదార్థం (యాంటీమ్యాటర్) సాధారణ పదార్థం (మ్యాటర్)తో కలిసిన వెంటనే పరస్పరం నాశనం అవుతాయి. ఈ ప్రక్రియలో శక్తి విడుదల అవుతుంది. ఈ నేపథ్యంలో తాజా ప్రయోగంలో 92 యాంటీప్రొటాన్లను ప్రత్యేకంగా రూపొందించిన క్రయోజెనిక్ పెన్నింగ్ ట్రాప్‌లో భద్రపరిచారు. ఇందులో అత్యంత శీతలీకరణతో పాటు సూపర్ కండక్టింగ్ అయస్కాంతాలను అమర్చారు.
వివరాలు
ప్రత్యేక ట్రాప్
ఈ ప్రత్యేక పెట్టెను ట్రక్కులో ఉంచి కొంతదూరం రోడ్డుపై రవాణా చేసి, అనంతరం మళ్లీ ప్రయోగశాలకు తీసుకువచ్చారు. ఈ ప్రయోగం సమయంలో యాంటీప్రొటాన్లు ట్రాప్ గోడలను తాకకుండా శూన్యంలో తేలియాడుతూ సురక్షితంగా నిల్వయ్యాయి. ఒక చోటు నుంచి మరో చోటుకు ఈ రేణువులను గోడలకు తగలకుండా తరలించగలమా అన్నదే శాస్త్రవేత్తల ప్రధాన లక్ష్యం. భవిష్యత్తులో లోతైన పరిశోధనల కోసం జర్మనీలోని హెయిన్‌రిచ్ హెయిన్ విశ్వవిద్యాలయంకు యాంటీప్రొటాన్లను తరలించాలన్న ప్రణాళికలో ఇది తొలి దశగా భావిస్తున్నారు. రవాణా సమయంలో ట్రక్కు ఆగినా, అకస్మాత్తుగా బ్రేకులు వేసినా, వేగం పెరిగినా యాంటీప్రొటాన్ల భద్రతకు ఎలాంటి సమస్యలు రాకుండా ప్రత్యేకంగా ఈ ట్రాప్‌ను రూపొందించారు.
వివరాలు
తక్కువ శక్తి గల యాంటీప్రొటాన్ల తయారీ
యాంటీప్రొటాన్లు అత్యంత సూక్ష్మ కణాలు. వాటి ద్రవ్యరాశి 100 హైడ్రోజన్ పరమాణువుల కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ కణాలు పదార్థాన్ని తాకినా విడుదలయ్యే శక్తి చాలా స్వల్పంగా ఉంటుంది. ఆ శక్తిని గుర్తించాలంటే అధిక సున్నితత్వం గల పరికరాలు అవసరం. సెర్న్ ఆధ్వర్యంలో ఉన్న లార్జ్ హాడ్రన్ కొలైడర్ (LHC)లో ప్రతిపదార్థంపై ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులోని యాంటీప్రొటాన్ డిసెలరేటర్ ద్వారా తక్కువ శక్తి గల యాంటీప్రొటాన్లను తయారు చేస్తున్నారు. మునుపటి ప్రయోగాల్లో ప్రొటాన్లను రవాణా చేసిన అనుభవం ఉన్నప్పటికీ, యాంటీప్రొటాన్ల రవాణాలో మరింత జాగ్రత్తలు అవసరమవుతాయి. ప్రతిపదార్థం కూడా సాధారణ పదార్థంలాగే ఉన్నప్పటికీ, దాని విద్యుదావేశం, అయస్కాంత లక్షణాలు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి.