Taste the music: లాలీపాప్ తింటూ పాటలు వినొచ్చు.. CES 2026లో ఆకట్టుకుంటున్న మ్యూజికల్ లాలీపాప్
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా పాటలు వినాలంటే మనం హెడ్‌ఫోన్లు లేదా స్పీకర్లు ఉపయోగిస్తాం. అయితే లాలీపాప్ తింటూనే పాటలు వినడం గురించి ఎప్పుడైనా ఊహించారా? వినడానికి కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమే. లాస్ వేగాస్‌లో జరిగిన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ప్రదర్శన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2026)లో ఈ వినూత్న ఆవిష్కరణ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వివరాలు
ఏమిటి 'మ్యూజికల్ లాలీపాప్'?
ఈ ప్రత్యేకమైన లాలీపాప్‌ను నోట్లో పెట్టుకున్న వెంటనే మీ తలలోనే నేరుగా సంగీతం వినిపించడం ప్రారంభమవుతుంది. దీని వెనుక పనిచేసే టెక్నాలజీని బోన్ కండక్షన్ టెక్నాలజీ అంటారు.లాలీపాప్ ద్వారా వచ్చే కంపనలు ముందుగా పళ్లకు చేరి,అక్కడి నుంచి దవడ ఎముకల ద్వారా లోపలి చెవికి చేరుతాయి. దీంతో బయటకు శబ్దం వినిపించకుండా, ఆ సంగీతం కేవలం లాలీపాప్ పట్టుకున్న వ్యక్తికే వినిపిస్తుంది. అంతేకాదు, లాలీపాప్‌ను కొరికినా లేదా నోట్లో కదిలించినప్పుడల్లా సంగీతం తీవ్రతలో స్వల్ప మార్పులు కనిపిస్తాయి. CES 2026లో ఇది ప్రధాన ఆకర్షణగా మారినా, ఇలాంటి ఆలోచన పూర్తిగా కొత్తది కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. 1990ల కాలంలో "టూత్ ట్యూన్స్" అనే పేరుతో ఇలాంటి పరికరాలు అందుబాటులో ఉండేవి.
వివరాలు
ప్రత్యేకతలు
పిల్లలు పళ్లను తోముకునే సమయంలో బోర్ కాకుండా ఉండేందుకు బ్రష్‌లోనే సంగీతం వినిపించేలా వాటిని రూపొందించారు. అయితే ప్రస్తుతం ప్రదర్శనలో ఉన్న మ్యూజికల్ లాలీపాప్ మాత్రం ఆధునిక డిజైన్‌తో పాటు మెరుగైన సౌండ్ క్వాలిటీతో మరింత ఆకట్టుకుంటోంది. ఈ మ్యూజికల్ లాలీపాప్ బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌తో సులభంగా కనెక్ట్ అవుతుంది. దీంతో వినియోగదారులు తమకు నచ్చిన పాటలను ఎంపిక చేసుకుని వినే అవకాశం ఉంటుంది. ఇది కేవలం టెక్నాలజీ గాడ్జెట్ మాత్రమే కాదు,తినడానికి కూడా రుచికరంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ, మింట్ వంటి పలు ఫ్లేవర్లలో ఇది అందుబాటులోకి రావడం ప్రత్యేకత.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త గాడ్జెట్‌కు సంబంధించిన వీడియోలు
ముఖ్యంగా టాబ్లెట్లు తీసుకోవడానికి ఇష్టపడని పిల్లలు లేదా పళ్లు తోముకోవడానికి మొండిగా ప్రవర్తించే పిల్లల కోసం భవిష్యత్తులో ఇలాంటి పరికరాలను మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. CES ప్రదర్శనకు వచ్చిన సందర్శకులు ఈ లాలీపాప్‌ను నోట్లో పెట్టుకుని, తమ తలలో వినిపిస్తున్న సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఫోటోలు దిగుతున్నారు. ఈ కొత్త గాడ్జెట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా వేగంగా వైరల్ అవుతున్నాయి. మొత్తంగా చూస్తే, టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మన రోజువారీ అలవాట్లు కూడా ఎంత వినూత్నంగా మారుతున్నాయో చూపించే ఉదాహరణగా ఈ మ్యూజికల్ లాలీపాప్ నిలుస్తోంది.