Cyber Alert : సింగిల్ రీల్‌తోనే ఫోన్ హ్యాక్ అయ్యే ఛాన్స్.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులకు టెక్ నిపుణులు అత్యవసర హెచ్చరిక జారీ చేస్తున్నారు. వెంటనే తమ యాప్‌లను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల మెటా సంస్థ వాట్సాప్‌లో రెండు కీలక భద్రతా లోపాలను గుర్తించింది. ఈ లోపాలను వెంటనే సరిచేసినప్పటికీ, పాత వెర్షన్‌లు ఉపయోగిస్తున్న యూజర్లకు ఇప్పటికీ ముప్పు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. సైబర్ సెక్యూరిటీ నిపుణుల ప్రకారం, ఈ సెక్యూరిటీ లోపాల ద్వారా హ్యాకర్లు యూజర్ల ఫోన్లు, డివైజ్‌లలోకి చొరబడే అవకాశం ఉంది. అందుకే ప్రతి యూజర్ వీలైనంత త్వరగా వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను అప్‌డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
వివరాలు
అనుమానాస్పద లింక్‌లను క్లిక్ చేయొద్దు
మొదటి భద్రతా లోపం రీల్స్ కంటెంట్‌ను చూడడానికి ఉపయోగించే ఏఐ ఆధారిత వాట్సాప్ ఫీచర్‌లో గుర్తించారు. యూజర్ అనుభవాన్ని మెరుగుపర్చేందుకు రూపొందించిన ఈ ఫీచర్‌లో కొన్ని వెర్షన్‌లలో పూర్తి స్థాయి సెక్యూరిటీ ప్యాచ్ లేకపోయినట్లు తేలింది. దీని కారణంగా యూజర్ ఏదైనా మెసేజ్ ఓపెన్ చేసిన వెంటనే యాప్ అనుమానాస్పద లింక్‌ల నుంచి మీడియా ఫైళ్లను లోడ్ చేసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో యూజర్లకు తెలియకుండానే బయటి వెబ్‌సైట్‌లు లేదా ప్రమాదకర కంటెంట్ యాక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక రెండో భద్రతా లోపం వాట్సాప్ విండోస్ వెర్షన్‌లో బయటపడింది. ఇది ముఖ్యంగా ఫైల్ అటాచ్‌మెంట్‌లకు సంబంధించినదిగా గుర్తించారు.
వివరాలు
హానికర సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ అయ్యే ప్రమాదం
సైబర్ మోసగాళ్లు ఫోటో లేదా డాక్యుమెంట్‌లా కనిపించే ఫైళ్లను పంపించి, వాటిలో ప్రమాదకరమైన ప్రోగ్రామ్‌లను దాచిపెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ యూజర్లు పొరపాటున అలాంటి ఫైల్‌ను ఓపెన్ చేస్తే, వారి కంప్యూటర్ లేదా డివైజ్‌లో మాల్‌వేర్ లేదా ఇతర హానికర సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉంది. ఈ తరహా సైబర్ ట్రిక్స్ ద్వారా హ్యాకర్లు యూజర్ల డివైజ్‌లపై నియంత్రణ సాధించే ప్రయత్నం చేస్తుంటారని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ భద్రతా లోపాల కారణంగా యూజర్ డేటా దుర్వినియోగం అయినట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవని మెటా స్పష్టం చేసింది.
వివరాలు
యూజర్లు అప్రమత్తంగా ఉండాలి
అలాగే ఈ సమస్యలకు సంబంధించిన సెక్యూరిటీ ప్యాచ్‌ను ఇప్పటికే విడుదల చేసినట్లు సమాచారం. ఏదేమైనా యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా తెలియని నంబర్ల నుంచి వచ్చే లింకులు, ఫైళ్లు లేదా అటాచ్‌మెంట్‌లను ఓపెన్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. చిన్న నిర్లక్ష్యమే వ్యక్తిగత డేటాను ప్రమాదంలో పడేస్తుందని జాగ్రత్త చెబుతున్నారు.