జూలై 13న చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చీఫ్
చంద్రయాన్-3 మిషన్‌ను జులై 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) సోమవారం ప్రకటించింది. భారత అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ కూడా దీన్ని ధృవీకరించారు. అయితే ప్రయోగ తేదీని జులై 19వ తేదీకి కూడా మార్చే అవకాశం ఉంది. చంద్రుడిపైకి రాకెట్ సురక్షితంగా ల్యాండ్ చేయడంపై ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో చీఫ్ వెల్లడించారు. అంతకుముందు సోమనాథ్ మీడియాతో మాట్లాడుతూ, జులై 12నుంచి జులై 19మధ్య కాలం ప్రయోగానికి అనువైనదిగా ప్రకటించారు. అనుకున్నట్లుగానే ప్రయోగ తేదీని 13గా నిర్ధారించారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా దేశాలు మాత్రమే చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష నౌకను దించగలిగాయి. ఇప్పుడు చంద్రయాన్-3 ద్వారా ఆ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ అవతరించేందుకు ఉవ్విళ్లూరుతోంది.