అన్నీ ఫెయిలైనా చంద్రుడిపై చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ అవుతుంది: ఇస్రో ఛైర్మన్
చంద్రుడి మీదకు వెళ్తున్న చంద్రయాన్-3 ప్రయోగం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3, ఆగస్టు 23వ తేదీన చంద్రుడు ఉపరితలంపై ల్యాండ్ కానుంది. అయితే తాజాగా చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్ గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. చంద్రయాన్-3 ప్రయోగంలో అన్నీ ఫెయిలైనా కూడా ల్యాండర్ విక్రమ్, చంద్రుడి మీద దిగుతుందని, అన్ని సెన్సార్లు పనిచేయకపోయినా సురక్షితంగా దిగేలా డిజైన్ చేసామని సోమనాథ్ తెలియజేసారు. ఇప్పటివరకు చంద్రుడి కక్ష్య కుదింపు చర్యలు ఒకసారి జరిగాయి. మరో మూడు సార్లు ఆగస్టు 9, 14, 16తేదీల్లో కక్ష్య కుదింపు చర్యలు జరగనున్నాయట. దీనివల్ల చంద్రుడి ఉపరితలానికి మరింత దగ్గరకు చంద్రయాన్-3 వెళ్ళనుంది.
చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 ల్యాండింగ్
చంద్రయాన్-3 సురక్షితంగా ల్యాండ్ కావాలని భారతీయులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతా అనుకున్నట్లు సాఫీగా జరిగితే భారతదేశం చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. చంద్రయాన్-3 మిషన్ ప్రయాణం, జులై 14వ తేదీన ప్రారంభమైంది. ముందుగా భూమి కక్ష్యలోకి వెళ్ళిన చంద్రయాన్-3 నెమ్మదిగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. మరికొన్ని రోజుల్లో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ కానుంది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన మొదటి ప్రయోగంగా చరిత్ర సృష్టించనుంది. ప్రస్తుతం భారతీయులంతా ఆ క్షణం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు