నింగికి దూసుకెళ్లనున్న చంద్రయాన్-3.. శ్రీహరికోట నుంచి జులై 12 -19 మధ్య ప్రయోగం
ఈ వార్తాకథనం ఏంటి
జులై 12 నుంచి 19 మధ్య చంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. నిర్దేశించిన పరీక్షలన్నీ సాఫీగా సాగితే నిర్ణయించిన గడువు మేరకు చంద్రయాన్ ను ప్రయోగిస్తామని తెలిపారు.
గడువు తర్వాత కూడా ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు వీలుంటుందని, కానీ ఇంధన ఖర్చు తడిసి మోపడవుతుందన్నారు.
ప్రయోగం నేపథ్యంలో చంద్రయాన్-3 వ్యోమనౌక ఇప్పటికే శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రానికి చేరిందన్నారు.
తుది ఏర్పాట్లు జూన్ నెలాఖరు వరకు పూర్తి కానున్నట్లు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పేర్కొన్నారు.
ఇది చంద్రయాన్ 2 లాగానే ల్యాండర్ తో పాటు రోవర్‌ను కలిగి ఉన్నప్పటికీ ఆర్బిటర్ మాత్రం ఉండదు.
DETAILS
సౌర శక్తిని కోసం పెద్ద సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేశాం : ఛైర్మన్
త్వరలో చేపట్టబోయే చంద్రయాన్-3 ప్రయోగానికి ఎల్‌వీఎం-3 రాకెట్ ను ఉపయోగించనున్నట్లు తెలిపిన సోమనాథ్, ప్రస్తుతం కూర్పు పని సాగుతున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన విడి భాగాలన్నీ ముందస్తుగానే శ్రీహరికోటకు చేరుకున్నాయన్నారు.
రాకెట్ కూర్పు ప్రక్రియ ఈ నెలాఖరు వరకు పూర్తి చేస్తామన్న ఇస్రో ఛైర్మన్, ఆ తర్వాత చంద్రయాన్-3ని రాకెట్‌తో అనుసంధానిస్తామని చెప్పుకొచ్చారు.
రాకెట్ ప్రయోగంలో ఇబ్బందులేవీ తలెత్తకుండా వ్యోమనౌకలో భారీగా మార్పులు చేపట్టినట్టు ఆయన వివరించారు.
అందులో భాగంగానే అధిక ఇంధనాన్ని సైతం జోడించి, రాకెట్ కాళ్లను మరింత శక్తివంతం చేశామన్నారు. ఎక్కువ సౌర శక్తిని ఒడిసిపట్టేలా పెద్ద పెద్ద సోలార్ ప్యానెల్స్ ను సైతం అమర్చామన్నారు.