చంద్రయాన్-3: విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్ర లేస్తాయా? రెండవ దశ మొదలవుతుందా?
చంద్రుడి ఉపరితలం మీద ఆగస్టు 23వ తేదీన అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు, 14రోజుల పాటు తమ పరిశోధనలు చేసాయి. 14రోజుల తర్వాత వాటిని నిద్రావస్థలోకి ఇస్రో శాస్త్రవేత్తలు పంపించివేసారు. చంద్రుడి మీద 14రోజులు పగలు ఉంటే, మరో 14రోజులు రాత్రి ఉంటుంది. రాత్రి కాగానే అక్కడ ఉష్ణోగ్రత విపరీతంగా తగ్గిపోతుంది. మైనస్ 130డిగ్రీ సెల్సియస్ కు టెంపరేచర్ పడిపోవడం వల్ల విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ పనిచేయవు. అందుకే వాటిని నిద్రవస్థలోకి పంపారు. మళ్ళీ చంద్రుడి మీద పగలు ఏర్పడిన తర్వాత వాటిని స్లీప్ మోడ్ నుండి మేల్కొల్పుతారు. అయితే ఆ సమయం రానే వచ్చింది. ఈరోజు విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ని మేల్కొల్పుతున్నారు .
మైనస్ 10డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరితే నిద్ర లేచే అవకాశం
చంద్రుడిపై ఉష్ణోగ్రత పెరిగి మైనస్ 10డిగ్రీలకు చేరుకుంటే విక్రమ్ ల్యాండర్, రోవర్ ల మీద ఎండ పడి అవి యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. మరి అవి యాక్టివేట్ అవుతాయా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నా కూడా పనిచేసే విధంగా విక్రమ్ ల్యాండర్, రోవర్లను తీర్చిదిద్దారు. కానీ చంద్రుడి ఉపరితలం మీద పరిస్థితులు ఎలా ఉన్నాయో ఎవ్వరికీ తెలియదు. మరి అంతా సరిగ్గా జరిగి విక్రమ్ ల్యాండర్, రోవర్లు నిద్ర లేస్తే గనక చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. చంద్రుడి మీద ఒక్కసారి నిద్రావస్థలోకి వెళ్ళాక, మళ్ళీ నిద్రలేచి తమ పనిని కొనసాగించిన దాఖలాలు ఎక్కడా లేవు. ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలిస్తుందా లేదా అన్నది ఈరోజు తెలిసిపోతుంది.