Antonio Guterres: 'ఇంకా ఆలస్యం చేయొద్దు'.. ఉష్ణోగ్రత పెరుగుదలపై యూఎన్ చీఫ్ గుటెర్రెస్ హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ మానవజాతికి గట్టి హెచ్చరిక జారీ చేశారు. గ్లోబల్ వార్మింగ్‌ను 1.5 డిగ్రీల సెల్సియస్ వరకు పరిమితం చేయాలనే పారిస్ ఒప్పంద లక్ష్యం ఇప్పుడు తప్పిపోయిందని, వెంటనే దిశ మార్చకపోతే "భయంకరమైన పరిణామాలు తప్పవు" అని ఆయన స్పష్టం చేశారు. రాబోయే నవంబరులో బ్రెజిల్‌లోని బెలెం నగరంలో జరగనున్న COP30 సమ్మిట్‌కు ముందు గుటెర్రెస్ ఒక్క ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. "మన వైఫల్యాన్ని అంగీకరించాల్సిన సమయం ఇది. 1.5°C పరిమితి మించి వెళ్తున్నాం. దానివల్ల అమెజాన్ అడవులు, గ్రీన్లాండ్, అంటార్కిటికా, సముద్రపు పగడభూములు వంటి ప్రకృతి వ్యవస్థలు ప్రమాదంలో పడతాయి," అని ఆయన పేర్కొన్నారు.
వివరాలు
గత దశాబ్దం భూమి చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదు
ప్రపంచ వాతావరణ రక్షణకు COP30లో దిశా మార్పు తప్పనిసరిగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. "అమెజాన్ అడవి సావన్నాగా మారిపోవడం మేము చూడకూడదు. అందుకే తక్షణమే కార్బన్ ఉద్గారాలను భారీగా తగ్గించడం తప్ప మరో మార్గం లేదు," అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ స్పష్టం చేశారు. గత దశాబ్దం భూమి చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదైందని ఆయన గుర్తు చేశారు. ఇంధన వనరులైన చమురు, బొగ్గు, వాయువు వినియోగం తగ్గకపోవడంతో ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. 197 దేశాల్లో కేవలం 62 దేశాలు మాత్రమే పారిస్ ఒప్పందం కింద తమ వాతావరణ చర్య ప్రణాళికలను సమర్పించాయని ఆయన వివరించారు.
వివరాలు
COP30 సమ్మిట్ నుంచే మార్పు ప్రారంభం కావాలి: గుటెర్రెస్
"ఇప్పటి వరకు వచ్చిన ప్రణాళికలు ఉద్గారాలను కేవలం 10% వరకు మాత్రమే తగ్గించగలవు. కానీ 1.5°C లక్ష్యానికి 60% తగ్గింపు అవసరం. కాబట్టి, తాత్కాలికంగా ఆ పరిమితి దాటడం ఇప్పుడు తప్పదనే చెప్పాలి," అని గుటెర్రెస్ పేర్కొన్నారు. అయినా ఆయన నమ్మకం కోల్పోలేదు. తాత్కాలికంగా ఉష్ణోగ్రతలు పెరిగినా, శతాబ్దం చివరినాటికి మళ్లీ 1.5°C స్థాయికి తగ్గించడం సాధ్యమేనని గుటెర్రెస్ అన్నారు. అయితే,ఆ దిశగా వెళ్లాలంటే COP30 సమ్మిట్ నుంచే మార్పు ప్రారంభం కావాలని ఆయన సూచించారు. అయన ప్రభుత్వాలకు పిలుపునిస్తూ,కార్పొరేట్ సంస్థల కంటే స్థానిక సమాజాలు, ముఖ్యంగా ఆదివాసీ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. "లాబీయిస్టుల లక్ష్యం లాభాలు పెంచుకోవడమే. కానీ దాని మూల్యం మానవజాతి చెల్లిస్తోంది," అని ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
చమురు, వాయువును మానవజాతి వినియోగించలేని పరిస్థితి
ఇంధన మార్పు ఆర్థిక అవసరమని, ఫాసిల్ ఫ్యూయెల్స్ యుగం ముగింపు దశకు చేరిందని గుటెర్రెస్ అన్నారు. "నూతన పునరుత్పాదక ఇంధన విప్లవం మొదలైంది. ఇప్పటికే కనుగొన్న మొత్తం చమురు, వాయువును మానవజాతి వినియోగించలేని పరిస్థితి వస్తుంది," అని చెప్పారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూలాతో అమెజాన్ నది తీర ప్రాంతంలో చమురు అన్వేషణపై మాట్లాడారా అని అడిగితే, "ఇంకా మాట్లాడలేదు, COP సమయంలో ఆ అంశంపై చర్చిస్తాను," అని చెప్పారు. COP30లో బ్రెజిల్ ప్రభుత్వం ప్రారంభించనున్న "ట్రాపికల్ ఫారెస్ట్స్ ఫరెవర్ ఫెసిలిటీ" ద్వారా $125 బిలియన్ సేకరించి, అడవులను రక్షించడమే లక్ష్యమని చెప్పారు. అందులో 20% నిధులు నేరుగా ఆదివాసీ సమాజాలకు అందజేయనున్నట్లు వివరించారు.
వివరాలు
ఆదివాసీ వర్గాలే ప్రకృతిని రక్షించడంలో ముందుంది
ఆదివాసీ వర్గాలే ప్రకృతిని రక్షించడంలో ముందున్నారు. వారి గొంతుకలకు గౌరవం ఇవ్వాలి," అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి గుటెర్రెస్ అన్నారు. రాజకీయ నాయకులు ప్రకృతితో సమతౌల్యం సాధించే పాఠాలు ఆదివాసీ సమాజాల నుండి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. "ఆర్థిక ఇబ్బందులు, విపత్తులు ఉన్నప్పటికీ ప్రకృతితో సమన్వయం ఎంత ముఖ్యమో గుర్తు చేసేందుకు రాజకీయ నేతలకు నిరంతరం అవగాహన కల్పించాలి," అని అన్నారు. COP వ్యవస్థపై విమర్శలు ఉన్నప్పటికీ అది కీలకమని గుటెర్రెస్ స్పష్టం చేశారు.
వివరాలు
మనకు ఉన్న అత్యంత విలువైన ఆస్తి 'మన తల్లి ప్రకృతి'
అంతర్జాతీయ నియంత్రణ లేకపోతే ప్రపంచం మొత్తం గందరగోళం అవుతుంది. ధనికులు,కార్పొరేట్ వర్గం మాత్రం తమను రక్షించుకుంటారు. కానీ సాధారణ ప్రజలు ప్రకృతి విపత్తుల దెబ్బకు చితికిపోతారు," అని గుటెర్రెస్ కఠినంగా వ్యాఖ్యానించారు. తన పదవీకాలం వచ్చే ఏడాదితో ముగియనుందని గుటెర్రెస్ తెలిపారు. "వాతావరణ పరిరక్షణ, ప్రకృతి సంరక్షణ కోసం నా పోరాటం ఎప్పటికీ ఆగదు. మనకు ఉన్న అత్యంత విలువైన ఆస్తి 'మన తల్లి ప్రకృతి'. ఆమెను కాపాడటమే ప్రతి మనిషి బాధ్యత," అని గుటెర్రెస్ స్పష్టం చేశారు.