ChatGPT: 2025లో అత్యధిక డౌన్‌లోడ్స్ సాధించిన ఐఫోన్ యాప్.. చాట్‌జీపీటీ
ఈ వార్తాకథనం ఏంటి
2025లో అమెరికా యాప్ స్టోర్‌లో అత్యధిక డౌన్‌లోడ్స్ సాధించిన యాప్‌ల జాబితాను ఆపిల్ విడుదల చేసింది. ఈ తాజా చార్ట్స్‌లో చాట్‌జీపీటీ (ChatGPT) అగ్రస్థానాన్ని దక్కించుకుంది. అమెరికాలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన ఉచిత ఐఫోన్ యాప్‌గా ఇది నిలిచింది. దీంతో టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్, గూగుల్ వంటి ప్రముఖ యాప్‌లను ఇది వెనక్కి నెట్టింది. గత సంవత్సరం నాలుగో స్థానంలో ఉన్న ఈ ఏఐ యాప్, 2025లో మాత్రం థ్రెడ్స్,గూగుల్, టిక్‌టాక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పెద్ద యాప్‌లను అధిగమిస్తూ చార్ట్స్‌ను టాప్ చేసింది. ఈ ఏడాది మార్చిలో ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధిక డౌన్‌లోడ్స్ సాధించి, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి పాపులర్ యాప్స్‌ను అధిగమించింది.
వివరాలు
GPT-5.2 పై OpenAI దృష్టి
గూగుల్ మ్యాప్స్ వంటి కీలక యుటిలిటీ యాప్‌ల కంటే వేగంగా ప్రజాదరణ పొందిన చాట్‌జీపీటీ, మొబైల్ డివైజ్‌లలో సెర్చ్ రంగంలో గూగుల్‌కు గట్టి పోటీగా నిలుస్తోంది. చాట్‌జీపీటీ యాప్ డౌన్‌లోడ్స్ పెరుగుతున్న తీరు, ఇది రోజువారి అవసరాలలో కీలక పాత్ర పోషిస్తున్నదనే సంకేతాలను ఇస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం,ఓపెన్ఏఐ CEO సామ్ ఆల్ట్‌మాన్ ఇటీవల సంస్థలో 'కోడ్ రెడ్' అలర్ట్ జారీ చేసినట్టు చెబుతున్నారు. GPT-5.2 పనితీరును మరింత మెరుగుపరచడంపైనే మొత్తం దృష్టి పెట్టాలని టీమ్‌లను ఆదేశించినట్టు తెలుస్తోంది. కొత్త ఫీచర్లను జోడించడానికి బదులుగా, వేగం, ఖచ్చితత్వం, విశ్వసనీయత వంటి ప్రధాన అంశాలపై కేంద్రీకరించాలని నిర్ణయించారని The Verge తెలిపింది.
వివరాలు
చాట్‌జీపీటీలో కొత్త "షాపింగ్ రీసెర్చ్" ఫీచర్
గూగుల్ ఈ ఏడాది నవంబర్‌లో రిలీజ్ చేసిన జెమిని 3 మంచి ఆదరణ పొందడంతో, ఎలాన్ మస్క్ సహా అనేక టెక్ నాయకుల దృష్టిని ఆకర్షించడంతో, OpenAI తన వ్యూహాన్ని పునఃఛింతన చేసినట్టు సమాచారం. GPT-5.2 ను డిసెంబర్ చివరినాటికి విడుదల చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, అది కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉందని అంచనా. ఓపెన్ ఏఐ తాజాగా చాట్‌జీపీటీలో "షాపింగ్ రీసెర్చ్" అనే కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది వ్యక్తిగత షాపింగ్ అసిస్టెంట్‌లా పనిచేస్తూ, వినియోగదారుల కొనుగోలు అవసరాలకు సరిపోయే ప్రోడక్ట్స్‌ను ఏఐ ద్వారా పరిశీలించి సూచిస్తుంది.
వివరాలు
చాట్‌జీపీటీలో కొత్త "షాపింగ్ రీసెర్చ్" ఫీచర్
ఉదాహరణకు, "₹20,000 లోపు స్మార్ట్‌ఫోన్ కావాలి" లేదా "ఒక నిర్దిష్ట బ్రాండ్‌లో, ప్రత్యేక ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలి" అని అడిగితే, ఈ ఫీచర్ సంబంధిత ప్రోడక్ట్స్‌ను పరిశీలించి ఉత్తమ ఎంపికలను సూచిస్తుంది. షాపింగ్‌కు సంబంధించిన ఏ ప్రశ్న అడిగినా, వాటిపై పరిశోధన చేసి సరైన ప్రొడక్ట్ రికమెండేషన్స్‌ను అందించడమే ఈ ఫీచర్ లక్ష్యం.