LOADING...
Chatgpt: మొరాయించిన చాట్‌జీపీటీ సేవలు.. వేలాదిమందికి ఎర్రర్ మెసేజ్‌లు
మొరాయించిన చాట్‌జీపీటీ సేవలు.. వేలాదిమందికి ఎర్రర్ మెసేజ్‌లు

Chatgpt: మొరాయించిన చాట్‌జీపీటీ సేవలు.. వేలాదిమందికి ఎర్రర్ మెసేజ్‌లు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
07:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ పనులకు ఆధారంగా మారిన చాట్‌జీపీటీ తాజాగా అమెరికాలో కొద్దిసేపు మొరాయించింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి అనేక మంది యూజర్లకు ఈ చాట్‌బాట్ సేవలు సరిగా అందుబాటులోకి రాలేదు. ముఖ్యంగా కొత్తగా ప్రశ్నలు అడగడానికి ప్రయత్నించినప్పుడు ఎర్రర్ మెసేజ్‌లు కనిపించడంతో యూజర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. గంటల తరబడి సేవలు నిలిచిపోవడంతో పలువురు అయోమయంలో పడ్డారు. అవుటేజ్‌లను ట్రాక్ చేసే 'డౌన్‌డిటెక్టర్' వెబ్‌సైట్ సమాచారం ప్రకారం,మధ్యాహ్నం 3:30 నుంచి 4 గంటల మధ్య (ఈస్టర్న్ టైమ్) ఒక్కసారిగా ఫిర్యాదులు పెరిగాయి. దాదాపు 12,500మందికిపైగా యూజర్లు తమకు ChatGPT పనిచేయడం లేదని రిపోర్ట్ చేశారు. అయితే కొంత సమయం గడిచిన తర్వాత ఈ ఫిర్యాదుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.

వివరాలు 

OpenAI వివరణ ఇదే..

ఈ సమస్యపై ChatGPT మాతృ సంస్థ OpenAI స్పందించింది. తమ అధికారిక స్టేటస్ పేజీలో, 'ఫైన్ ట్యూనింగ్ జాబ్స్'తో పాటు ప్లాట్‌ఫామ్ వినియోగదారులకు 'ఎలివేటెడ్ ఎర్రర్ రేట్స్' సమస్య ఎదురైనట్లు సంస్థ వెల్లడించింది. లోపాన్ని గుర్తించిన వెంటనే సాంకేతిక బృందాలు చర్యలు చేపట్టి, ఇప్పుడు సమస్యను పూర్తిగా పరిష్కరించినట్లు OpenAI స్పష్టం చేసింది. ప్రస్తుతం అన్ని సేవలు సాధారణంగానే కొనసాగుతున్నాయని తెలిపింది. ChatGPT పనిచేయకపోవడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల స్పందనలు వెల్లువెత్తాయి. X (ట్విట్టర్), రెడ్డిట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో సరదా మీమ్స్, కామెంట్లు హల్‌చల్ చేశాయి. ఓ యూజర్ "ఎవరొచ్చి నా రోజు ఎలా గడిచిందని అడిగారు, కానీ ChatGPT డౌన్ కావడంతో సమాధానం కూడా చెప్పలేకపోతున్నా" అంటూ నవ్వులు పూయించారు.

వివరాలు 

సోషల్ మీడియాలో నెటిజన్ల గోల..

మరో నెటిజన్ తన బాధను హాస్యంగా వ్యక్తం చేస్తూ,"నా బెస్ట్ ఫ్రెండ్, నా థెరపిస్ట్,నా జ్యోతిష్యుడు,నా లాయర్... ఇలా ప్రతి విషయానికి ఆధారపడే నా కన్సల్టెంట్ ChatGPT డౌన్ అయిపోయింది. త్వరగా తిరిగి రా చాట్" అంటూ పోస్ట్ చేశారు. ఇంకొక యూజర్ చేసిన వ్యాఖ్య మాత్రం అందరినీ ఆలోచింపజేసింది. "నాకు ఎర్రర్ మెసేజ్ రాగానే, ఆ మెసేజ్ అర్థం ఏంటో తెలుసుకోవడానికి మళ్లీ ChatGPT నే అడగాలని ట్రై చేశాను. నేను దీనికి ఎంతగా అలవాటు పడ్డానో అప్పుడు అర్థమైంది" అని పేర్కొన్నారు. ప్రస్తుతం సాంకేతిక లోపాలు తొలగిపోవడంతో యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. అమెరికాతో పాటు బ్రిటన్ వంటి కొన్ని ఇతర దేశాల్లో కూడా స్వల్పంగా ఈ ప్రభావం కనిపించినట్లు సమాచారం.

Advertisement