Loading...
Meta: క్లాడ్ ఏఐతో ఇన్‌స్టాగ్రామ్‌కు చిక్కులు.. ట్రంప్ వ్యతిరేక గ్రూప్ ఖాతా సస్పెండ్: మెటా
క్లాడ్ ఏఐతో ఇన్‌స్టాగ్రామ్‌కు చిక్కులు.. ట్రంప్ వ్యతిరేక గ్రూప్ ఖాతా సస్పెండ్: మెటా

Meta: క్లాడ్ ఏఐతో ఇన్‌స్టాగ్రామ్‌కు చిక్కులు.. ట్రంప్ వ్యతిరేక గ్రూప్ ఖాతా సస్పెండ్: మెటా

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 19, 2026
10:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ట్రంప్ వ్యతిరేక గ్రూప్‌ అయిన నో కింగ్స్ కూటమికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సస్పెండ్ కావడంపై మెటా సంస్థ క్షమాపణలు చెప్పింది. ఈ ఘటనకు కారణమేంటో వివరిస్తూ ప్రకటన విడుదల చేసింది. అమెరికా వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న సమయంలో, నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందుగా ముందస్తు ఓటింగ్‌పై ప్రచారం చేస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ ఏఐ సాధనం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకలాపాలు జరగడంతో మెటా ఆటోమేటెడ్ భద్రతా వ్యవస్థ పొరపాటున నో కింగ్స్ కూటమి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను నిలిపివేసింది.

వివరాలు 

క్లాడ్ ఏఐ స్పీడ్‌కు షాక్.. భారీగా ప్రొఫైల్స్, పోస్టుల యాక్సెస్!

క్లాడ్ ఏఐ అసాధారణ వేగంతో ప్రొఫైల్స్, పోస్టులు, హ్యాష్‌ట్యాగ్‌లను యాక్సెస్ చేసిందని ఇన్‌స్టాగ్రామ్ ఇంజినీరింగ్ బృందం గుర్తించింది.

తక్కువ సమయంలో వరుసగా పెద్ద సంఖ్యలో అభ్యర్థనలు రావడంతో వాటిని సాధారణ వినియోగదారుల కార్యకలాపాలుగా కాకుండా ఆటోమేటెడ్ బాట్ చర్యలుగా భద్రతా వ్యవస్థ భావించింది.

దీంతో నో కింగ్స్ కూటమి ఖాతా సస్పెండ్ అయింది.

ఈ విషయంపై మెటా కమ్యూనికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ స్టోన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

తక్కువ వ్యవధిలో అకస్మాత్తుగా, పెద్ద సంఖ్యలో వరుస అభ్యర్థనలు రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని వివరించారు.

వివరాలు 

90 నిమిషాల పాటు ఇన్‌స్టా ఖాతా బంద్..  

సుమారు గంట తర్వాత ఆటోమేటెడ్ సమీక్ష నిర్వహించిన మెటా.. ఆ ఖాతాను తొలగించాల్సిన అవసరం లేదని గుర్తించి తిరిగి పునరుద్ధరించింది.

అయితే, న్యూయార్క్ కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 5.33 గంటలకు మాత్రమే ఖాతాకు పూర్తి యాక్సెస్ లభించింది.

తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీ సుమారు 90 నిమిషాల పాటు అందుబాటులో లేకుండా పోయిందని నో కింగ్స్ కూటమి తెలిపింది.

ఖాతా మళ్లీ ఇతరులకు కనిపించడం ప్రారంభించిన తర్వాత కూడా నిర్వాహకులు కొంత సమయం పాటు దాన్ని యాక్సెస్ చేయలేకపోయారని పేర్కొంది.

ADVERTISEMENT