Cold Moon 2025: 2025లో చివరి సూపర్ మూన్ దర్శనం.. ఈసారి లాంగ్ నైట్ మూన్ స్పెషల్!
ఈ వార్తాకథనం ఏంటి
2025 సంవత్సరంలో ఆకాశంలో ఎక్కువ సంఖ్యలో సూపర్ మూన్స్ దర్శనమిచ్చాయి. మొత్తం ఏడాదిలో 8 సూపర్ మూన్స్ కనిపించగా,అక్టోబర్, నవంబర్ నెలల్లో వరుసగా అవి ఆకాశంలో మెరిశాయి. ఇప్పుడు అదే క్రమంలో డిసెంబర్‌లో కూడా మరో సూపర్ మూన్ వీక్షకులను ఆకట్టుకోనుంది. సాధారణంగా చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా వచ్చిన సమయంలో పౌర్ణమి తిథి పడితే, చంద్రుడు సాధారణం కంటే కొద్దిగా పెద్దగా, ప్రకాశవంతంగా దర్శనమిస్తాడు. దీనినే సూపర్ మూన్ అంటారు. ఈ ఏడాదికి సంబంధించిన ఆఖరి సూపర్ మూన్ డిసెంబర్ 4న ఆకాశంలో మెరవనుంది. అయితే నాసా పరిశోధనల ప్రకారం 'సూపర్ మూన్' అనేది ఖగోళ శాస్త్రంలో అధికారికంగా వినియోగించే పదం కాదు.
వివరాలు
డిసెంబరు 4న కనిపించబోయేది నిజమైన అద్భుత సూపర్ మూన్
పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి సగటు దూరంలో కనీసం 90 శాతం సమీపంగా ఉన్నప్పుడు దీన్ని సూపర్ మూన్‌గా వ్యవహరిస్తారు. ఇదే పౌర్ణమిని 'కోల్డ్ మూన్', 'లాంగ్ నైట్ మూన్' అని కూడా పిలుస్తారు. అక్టోబర్‌లో దర్శనమిచ్చిన హార్వెస్ట్ మూన్, నవంబర్‌లో ఆకట్టుకున్న బీవర్ మూన్ తర్వాత రాబోతున్నదే ఈ లాంగ్ నైట్ మూన్. డిసెంబరు 4న కనిపించబోయేది నిజమైన అద్భుత సూపర్ మూన్‌గా చెబుతున్నారు.
వివరాలు
భవనాల అడ్డంకులు లేని ఓపెన్ ప్రదేశంలో నుంచి వీక్షిస్తే మరింత ఆనందంగా చూడవచ్చు
చంద్రుడు తన కక్ష్యలో భూమికి అత్యంత సమీపంగా ఉండే సమయంలో పౌర్ణమి తిథి కలిసి రావడంతో ఇది ఏర్పడుతుంది. జ్యోతిష్య పరంగా దీన్ని వ్యక్తిగత మార్పులు, అభివృద్ధికి సూచనగా భావిస్తారు. ముఖ్యంగా సాయంత్రం వేళ చంద్రోదయ సమయంలో చంద్రుడు చాలా పెద్దగా కనిపించడం విశేషం. ఈ దృశ్యాన్ని 'మూన్ ఇల్యూషన్' అని అంటారు. చందమామ అందాన్ని నిండుగా ఆస్వాదించాలనుకునేవారు భవనాల అడ్డంకులు లేని ఓపెన్ ప్రదేశంలో నుంచి వీక్షిస్తే మరింత ఆనందంగా చూడవచ్చు.