National Technology Day 2023: జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
సాంకేతిక రంగంలో టెక్ దిగ్గజాలు, పరిశోధకులు, ఇంజనీర్ల విజయాలను స్మరించుకుంటూ భారతదేశంలో ప్రతి ఏటా మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. కౌన్సిల్ ఫర్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ మొదటి జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని అప్పటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి సమక్షంలో నిర్వహించింది. 1998లో మే 11న 'మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా', మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం నాయకత్వంలోవాజ్‌పేయి ప్రభుత్వం ఐదు పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించింది. పోఖ్రాన్ అణు పరీక్ష జ్ఞాపకార్థం దేశంలో 1999, మే11 నుంచి జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
'ఆపరేషన్ శక్తి' అనే కోడ్ నేమ్‌తో పోఖ్రాన్ అణు పరీక్షలు
1974లో 'స్మైలింగ్ బుధా' అనే కోడ్-పేరుతో భారత్ మొదటిసారి అణు పరీక్ష నిర్వహించింది. రెండోసారి 1998లో వరుసగా ఐదు పోఖ్రాన్ అణు పరీక్షలను నిర్వహించింది. దీనికి 'ఆపరేషన్ శక్తి' అనే కోడ్ నేమ్ పెట్టారు. పోఖ్రాన్ అణు పరీక్షల తర్వాత భారతీయులు ఎలైట్ న్యూక్లియర్ క్లబ్‌లో చేరారని అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రకటించారు. పోఖ్రాన్ అణు పరీక్షల విజయవంతంలో మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కృషి ఎనలేనిది. సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసే వ్యక్తులు అంతిమంగా దేశ అభివృద్ధికి కృషి చేస్తారని, అలాంటి వ్యక్తులను ఈ రోజున గౌరవిస్తారు.
జాతీయ సాంకేతిక దినోత్సవం-2023 థీమ్
ప్రతి సంవత్సరం, జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా కొత్త థీమ్‌ను ప్రకటిస్తారు. రోజు ఈవెంట్‌లు అదే థీమ్‌పై ఆధారపడి ఉంటాయి. జాతీయ సాంకేతిక దినోత్సవం 2023 థీమ్ 'స్కూల్ టు స్టార్టప్స్- ఇగ్నైటింగ్ యంగ్ మైండ్ టు ఇన్నోవేట్'. సైన్స్ అండ్ టెక్నాలజీ భవిష్యత్తు గురించి చర్చించడానికి కార్యక్రమాలు, చర్చలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. పాఠశాలలు, కళాశాలలు జాతీయ సాంకేతిక దినోత్సవం రోజున విద్యార్థులు తమ జ్ఞానాన్ని, ప్రతిభను ప్రదర్శించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి సోషల్ మీడియాలో సంబంధిత సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ప్రజలు జాతీయ సాంకేతిక దినోత్సవంలో పాల్గొనవచ్చు.