LOADING...
DoT Warning: +91తో వచ్చే ఫేక్ అంతర్జాతీయ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండండి: DoT హెచ్చరిక
+91తో వచ్చే ఫేక్ అంతర్జాతీయ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండండి: DoT హెచ్చరిక

DoT Warning: +91తో వచ్చే ఫేక్ అంతర్జాతీయ కాల్స్‌పై అప్రమత్తంగా ఉండండి: DoT హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
May 25, 2026
03:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో స్మార్ట్‌ ఫోన్ వినియోగదారులకు కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT) కీలక హెచ్చరిక జారీ చేసింది. అంతర్జాతీయ కాల్‌లలా కనిపిస్తూ +91 నంబర్‌తో వచ్చే కాల్స్‌పై జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్‌'లో DoT పోస్టు చేసింది. +91 అనేది భారత దేశ కోడ్ అని, నిజమైన అంతర్జాతీయ కాల్స్ అయితే ఆయా దేశాల కోడ్‌తోనే వస్తాయని స్పష్టం చేసింది.

వివరాలు 

ఫేక్ కాల్స్‌పై హెచ్చరిక

"+91తో వచ్చి ఇది ఇంటర్నేషనల్ కాల్ అని చెబితే అదే మొదటి హెచ్చరిక సంకేతం" అని DoT పేర్కొంది. ప్రస్తుతం మోసగాళ్లు కాలర్ ఐడీ స్పూఫింగ్ టెక్నాలజీ ఉపయోగించి కాల్స్‌ను నమ్మదగినవిగా చూపిస్తున్నారని తెలిపింది. టెలికాం అధికారులు, పోలీస్‌లు, బ్యాంక్ ప్రతినిధులు లేదా డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లమంటూ ప్రజలను భయపెట్టి వ్యక్తిగత వివరాలు సేకరించే ప్రయత్నాలు చేస్తున్నారని వెల్లడించింది.

వివరాలు 

ఎందుకు ప్రమాదకరం?

ఇలాంటి ఫేక్ కాల్స్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు,OTPలు,పాస్‌వర్డ్‌లు వంటి కీలక సమాచారం దోచుకునే ప్రమాదం ఉందని సైబర్ భద్రతా సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కొంతమంది మోసగాళ్లు SIM బ్లాక్ చేస్తామని,నకిలీ కేసులు పెడతామని,బిల్లు బకాయిలు ఉన్నాయని లేదా పార్సిల్ సమస్యల పేరుతో ప్రజలను భయపెడుతున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదకర లింకులు పంపించి డబ్బులు దోచుకునే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌లో ఎలాంటి వ్యక్తిగత లేదా ఆర్థిక సమాచారం పంచుకోవద్దని DoT సూచించింది. అనుమానాస్పద కాల్స్,టెలికాం మోసాలపై వెంటనే 'సంచార్ సాథి' (Sanchar Saathi) ప్లాట్‌ఫామ్‌లో ఫిర్యాదు చేయాలని కోరింది. డిజిటల్ భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగానే ఈ హెచ్చరిక జారీ చేసినట్లు తెలిపింది.

Advertisement