High Speed Rocket Sled: 'హై-స్పీడ్ రాకెట్ స్లెడ్ పరీక్ష దిగ్విజయం
ఈ వార్తాకథనం ఏంటి
రక్షణ రంగంలో భారత్ మరో అరుదైన ఘనత సాధించింది. యుద్ధ విమానాల ఎస్కేప్ సిస్టమ్‌కి సంబంధించిన రాకెట్ స్లెడ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ ఘనత సాధించిన అతి కొద్ది దేశాల సరసన సగర్వంగా నిలిచింది. అత్యంత వేగంగా జరిపిన ఈ పరీక్షను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మంగళవారం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సమయంలో ఎయిర్ క్రూ రికవరీతో పాటు అనేక కీలక భద్రతా ప్రమాణాలు విజయవంతంగా సాధించింది. చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ లాబోరేటరీలోని రైలు ట్రాక్ రాకెట్ స్లెడ్ వేదికగా గంటకు 800 కిలోమీటర్ల వేగంతో నియంత్రిత పరీక్ష నిర్వహించారు.
వివరాలు
అరుదైన దేశాల క్లబ్‌లో భారత్
రక్షణ శాఖ కార్యాలయం ప్రకారం, "కనోపీ సెవరెన్స్ ఎజెక్షన్ సీక్వెన్సింగ్, పూర్తి ఎయిర్ క్రూ రికవరీ వంటి అన్ని లక్ష్యాలను ఈ పరీక్ష విజయవంతంగా సాధించింది." దీనివల్ల భారత్ ఈ ఘనత సాధించిన అరుదైన దేశాల క్లబ్‌లో సగర్వంగా చేరిందని పేర్కొంది. DRDOతో పాటు, వాయుసేన, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, హిందూస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్(HAL) పనితీరును రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. దేశీయ రక్షణ సామర్థ్యాలను పెంచే స్వావలంబన దిశలో కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రయత్నాల్లో ఈ ఘనతను ఒక మైలురాయిగా గుర్తించారు.
వివరాలు
స్లెడ్ టెస్టు అంటే ఏమిటి?
విమానాలు గాల్లో అత్యధిక వేగంతో ఎగిరే పరిస్థితులను నేల మీద కృత్రిమంగా సృష్టించడానికి రాకెట్ స్లెడ్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఈ పరీక్ష కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రెండు రైలు పట్టాలపై రాకెట్ ప్రొపల్షన్ వ్యవస్థను అమర్చి, అవసరమైన అన్ని పరీక్షలు నిర్వహిస్తారు.