Artemis II: నీలిరంగులో మెరిసిన భూమి.. ఆర్టెమిస్ మిషన్‌లో అరుదైన ఫోటో విడుదల
ఈ వార్తాకథనం ఏంటి
భూమి నీలిరంగులో మెరిసిపోతూ కనువిందు చేసిన అద్భుత దృశ్యాలను నాసా తాజాగా విడుదల చేసింది. ఆర్టెమిస్ II మిషన్‌లో ప్రయాణిస్తున్న వ్యోమగాములు తీసిన ఈ చిత్రాలు అంతరిక్ష ప్రేమికులను అలరిస్తున్నాయి. భూమి నీలి కాంతుల్లో తళుక్కుమంటూ కనిపిస్తుండగా, ధ్రువ ప్రాంతాల వద్ద ఆకుపచ్చ రంగులో మెరిసే ఆరాలు (auroras) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చంద్రుడి వైపు ప్రయాణిస్తున్న ఈ మిషన్‌లో భాగంగా, మిషన్ కమాండర్ రీడ్ వైస్‌మాన్ భూమి అందాలను తన కెమెరాలో బంధించారు. వ్యోమగాములు ఈ తొలి చిత్రానికి హలో వరల్డ్ అనే పేరు పెట్టారు. అట్లాంటిక్ మహాసముద్రం నీలిరంగులో స్పష్టంగా కనిపిస్తూ, సూర్యకాంతి ప్రతిబింబంతో భూమి స్వల్పంగా మెరుస్తున్నట్లుగా కనిపిస్తోంది.
వివరాలు
ఎడమ వైపున పశ్చిమ సహారా, ఐబీరియా ద్వీపకల్పం
ఇక ధ్రువాల వద్ద గ్రీన్ ఆరాలు విరజిమ్ముతున్న దృశ్యం మరింత థ్రిల్ కలిగిస్తోంది. ఈ చిత్రంలో భూమి తలకిందులుగా కనిపించడం విశేషం. ఎడమ వైపున పశ్చిమ సహారా, ఐబీరియా ద్వీపకల్పం ఉండగా, కుడి వైపున దక్షిణ అమెరికా ఖండం కనిపిస్తోంది. భూమి దిగువ భాగంలో వెలుగుతూ కనిపిస్తున్న ఒక ప్రకాశవంతమైన బిందువును శాస్త్రవేత్తలు శుక్రుడు గ్రహంగా గుర్తించారు. ఓరియన్ అంతరిక్ష నౌక భూ కక్ష్యను విడిచి, ట్రాన్స్-లూనార్ బర్న్ పూర్తయిన తర్వాత ఈ చిత్రాలను తీసినట్లు నాసా వెల్లడించింది. ఈ మిషన్‌లో ఉన్న నలుగురు వ్యోమగాములు మొత్తం 2 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించనున్నారు.
వివరాలు
చంద్రుడికి సుమారు 2.5 లక్షల కిలోమీటర్ల దూరం
నాసా అంచనాల ప్రకారం, ఏప్రిల్ 6న ఆర్టెమిస్-2 చంద్రుడి అవతలివైపు చేరుకుని చుట్టివచ్చి, ఏప్రిల్ 10న మళ్లీ భూమికి చేరుకోనుంది. భూ కక్ష్య దాటిన వెంటనే వ్యోమగాములంతా ఆర్టెమిస్ కిటికీల వద్దకు చేరుకుని భూమి అందాలను ఆస్వాదించారని మిషన్ స్పెషలిస్ట్ జెరెమీ హాన్సెన్ తెలిపారు. చంద్ర కాంతిలో మెరిసే భూమిని చూసి మిరుమిట్లు గొలిపిందని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నానికి వ్యోమగాములు భూమి నుంచి సుమారు 1.8 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించారని, ఇంకా చంద్రుడికి సుమారు 2.5 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నారని నాసా వెల్లడించింది. సోమవారం నాటికి వారు తమ గమ్యానికి చేరుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.