Election Commission: ఓటర్ల డేటాకు ముప్పు.. ఈసీ వెబ్‌సైట్‌లో బగ్.. సరిచేసిన అధికారులు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) వెబ్‌సైట్‌లో ఉన్న కీలక భద్రతా లోపాన్ని అధికారులు సరిచేశారు. ఈ లోపం కారణంగా కొంతమంది ఓటర్ల వ్యక్తిగత సమాచారం,గుర్తింపు పత్రాలకు సంబంధించిన వివరాలు ఇతరులకు అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఏర్పడింది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ వెలుగులోకి తీసుకురావడంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల సమాచారం భద్రతపై ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది.
వివరాలు
ఈసీ వెబ్‌సైట్ పరిశీలనలో బయటపడిన లోపం
ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ను రాయిటర్స్ సంస్థ నెలకు పైగా పరిశీలిస్తున్న సమయంలో ఈ భద్రతా లోపాన్ని గుర్తించింది.
ఓటరు తన ఖాతాలోకి లాగిన్ అయి స్థానిక ఎన్నికల అధికారితో ఫోన్ కాల్ మాట్లాడేందుకు బుకింగ్ చేసుకున్నప్పుడు ఈ సమస్య బయటపడింది.
సాధారణ బ్రౌజర్‌లోని డెవలపర్ టూల్స్‌లో నెట్‌వర్క్ ట్యాబ్‌ను పరిశీలిస్తే.. కొత్త ఓటరుగా నమోదు చేసుకునేందుకు లేదా వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేసేందుకు ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తుల రిఫరెన్స్ నంబర్లు కనిపించాయి.
వివరాలు
ఓటర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం
ఈ రిఫరెన్స్ నంబర్లతో పాటు మరికొన్ని కీలక వివరాలు కూడా బయటపడే అవకాశం ఉన్నట్లు రాయిటర్స్ గుర్తించింది.
ఫోన్ కాల్ బుక్ చేసుకునే సమయంలో వినియోగదారుల పేరు, ఫోన్ నంబర్, ఈమెయిల్ చిరునామా, పుట్టిన తేదీ, ఇంటి చిరునామా వంటి వ్యక్తిగత సమాచారం కనిపించింది.
అంతేకాకుండా ఓటర్లు సమర్పించిన పాస్‌పోర్టుల వంటి గుర్తింపు పత్రాలకు సంబంధించిన ఫైల్ పాత్‌ల వివరాలు కూడా బయటపడ్డాయి.
వెబ్‌సైట్ కోడింగ్‌లో ఉన్న లోపం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని రాయిటర్స్ గుర్తించిన అంశాలను పరిశీలించిన భారత సైబర్ భద్రతా నిపుణులు కరణ్ సైనీ, ఎహ్రాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు.
వివరాలు
హ్యాకర్లు భారీగా డేటాను సేకరించే ప్రమాదం
దరఖాస్తుల రిఫరెన్స్ నంబర్లు ఒక క్రమపద్ధతిలో ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశం.
ఈ నంబర్లను ఊహించడం ద్వారా హ్యాకర్లు పెద్ద సంఖ్యలో ఓటర్ల సమాచారాన్ని ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండేదని నిపుణులు హెచ్చరించారు.
సాధారణ వినియోగదారులు ఫోన్ కాల్ బుక్ చేసుకునేటప్పుడు ఇలాంటి వివరాలను పరిశీలించకపోవచ్చు.
కానీ సైబర్ నేరగాళ్లు ఈ లోపాన్ని ఉపయోగించుకుని పెద్ద మొత్తంలో సమాచారాన్ని సేకరించి దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది.
రాయిటర్స్ గుర్తించిన అంశాలను సైబర్ భద్రతా నిపుణులు ఈసీ వెబ్‌సైట్‌లో దశలవారీగా పరిశీలించి ఈ విషయాన్ని నిర్ధారించారు.
వివరాలు
రాయిటర్స్ సమాచారం తర్వాత లోపాన్ని సరిచేసిన ఈసీ
ఈ భద్రతా లోపానికి సంబంధించిన వివరాలను రాయిటర్స్ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లింది.
దీనిపై స్పందించిన ఈసీ ప్రతినిధి.. సమస్యను పరిశీలించాలని తమ ఐటీ విభాగాన్ని ఆదేశించినట్లు తెలిపారు.
ఆ తర్వాత కొన్ని గంటల్లోనే వెబ్‌సైట్‌లోని లోపాన్ని సరిచేశారు. వ్యక్తిగత వివరాలు, ఫైల్ పాత్‌ల వంటి సున్నితమైన సమాచారాన్ని కనిపించకుండా తొలగించారు.
అయితే ఈ లోపాన్ని ఎవరైనా ఇప్పటికే దుర్వినియోగం చేశారా? ఇది ఎంతకాలంగా వెబ్‌సైట్‌లో ఉంది? అనే విషయాలు మాత్రం ఇంకా స్పష్టతకు రాలేదు.
రాయిటర్స్ ఈ లోపాన్ని గుర్తించిన ఫోన్ కాల్ బుకింగ్ సదుపాయాన్ని ఎన్నికల సంఘం 2025 జూన్‌లో ప్రారంభించింది.
వివరాలు
ఓటర్ల సమాచారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం
ఈ భద్రతా లోపం వల్ల ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడటం, వారి వివరాల ఆధారంగా ప్రొఫైలింగ్ చేయడం, బలహీన వర్గాల ప్రజలను ప్రభావితం చేయడం వంటి ప్రమాదాలు ఉన్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా స్పందిస్తూ.. రాయిటర్స్ వెల్లడించిన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.
మాజీ కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా మాత్రం ఈ లోపం ఉద్దేశపూర్వకంగా చేసినది కాకపోవచ్చని, అనుకోకుండా జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.