
Elon Musk: 10,000 స్టార్‌లింక్ శాటిలైట్లను ప్రయోగించిన సంస్థ.. అందరినీ మించిపోయామన్న ఎలాన్ మస్క్
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్ నాయకత్వంలోని స్పేస్-X సంస్థ మరో అద్భుతమైన అంతరిక్ష విజయాన్ని సాధించింది. తన శాటిలైట్ ఇంటర్నెట్ సేవ అయిన స్టార్‌లింక్ ద్వారా 10,000 శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించినట్లు సంస్థ సోమవారం ప్రకటించింది. ఈ మైలురాయిని చేరుకున్న స్టార్‌లింక్ బృందాన్ని, ముఖ్యంగా ఫాల్కన్ రాకెట్ టీంలను మస్క్ అభినందించారు. "ఇప్పుడు కక్ష్యలో ఉన్న అన్ని సంస్థల శాటిలైట్ల సంఖ్యను కలిపినా, మనవి వాటి కంటే ఎన్నో రెట్లు ఎక్కువ" అని ఆయన తన ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.
వివరాలు
ఈ ఏడాదే 132 ఫాల్కన్-9 రాకెట్ ప్రయోగాలు పూర్తి
నిన్న కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా 28 స్టార్‌లింక్ శాటిలైట్లు అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగంతో స్పేస్‌ఎక్స్ 10,000శాటిలైట్ల మైలురాయిని అధిగమించింది. ఇదే 2025సంవత్సరంలో సంస్థ చేసిన 132వఫాల్కన్-9 ప్రయోగం కావడం ప్రత్యేకత. ఇంకా రెండు నెలలు మిగిలుండగానే, స్పేస్‌ఎక్స్ గత సంవత్సరం సృష్టించిన రికార్డును సమం చేసింది. స్టార్‌లింక్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశ్యం ప్రపంచంలోని అతి దూరప్రాంతాలకైనా వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీ అందించడం. 2018లో కేవలం రెండు ప్రోటోటైప్ శాటిలైట్లతో ప్రారంభమైన ఈ నెట్‌వర్క్ ఇప్పుడు 150కి పైగా దేశాల్లో లక్షలాది వినియోగదారులకు సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు ప్రయోగించిన శాటిలైట్లలో 8,000కుపైగా ప్రస్తుతం చురుకుగా పనిచేస్తున్నాయి. స్టార్‌లింక్ సేవలకు భారతదేశంలోనూ అధికారిక అనుమతి లభించింది.
వివరాలు
స్టార్‌షిప్ రాకెట్ 11వ పరీక్షకూడా విజయవంతం
స్పేస్‌ఎక్స్ భవిష్యత్తు ప్రణాళికల ప్రకారం, ఈ శాటిలైట్ నెట్‌వర్క్‌ను తొలుత 12,000 శాటిలైట్లకు, తరువాత 30,000కుపైగా విస్తరించనున్నారు. ఇదిలా ఉంటే, స్పేస్‌ఎక్స్ ఇటీవల తన భారీ రాకెట్ స్టార్‌షిప్ 11వ పరీక్షా ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ రాకెట్‌ను నాసా ఆర్టెమిస్-3 చంద్ర మిషన్ కోసం ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో అంగారక గ్రహంపై మానవ వాసాలను నెలకొల్పే స్పేస్‌ఎక్స్ లక్ష్యం కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమని సంస్థ తెలిపింది.