Starlink: భారత్‌లో ఎంట్రీ ఇచ్చిన ఎలాన్ మస్క్ స్టార్‌లింక్.. ఢిల్లీలో తొలి కార్యాలయం
ఈ వార్తాకథనం ఏంటి
ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీలోని నౌరోజీ నగర్‌లో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ (WTC)లో తన తొలి కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఇదే భవనంలో ఇప్పటికే సామ్ ఆల్ట్‌మాన్‌కు చెందిన ఓపెన్‌ఏఐ కూడా కార్యాలయం నిర్వహిస్తోంది. స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్, భారత్‌లో కొత్త తరహా శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందించే దిశగా ముందడుగు వేసింది. ఈటీ కథనం ప్రకారం,స్టార్‌లింక్ సుమారు 50 మంది సిబ్బందికి సరిపడే కార్యాలయాన్ని ప్రీమియం ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ సంస్థ కార్పొరేట్ ఎడ్జ్ ద్వారా లీజుకు తీసుకుంది. ఇది భారత్‌లో వాణిజ్య సేవలు ప్రారంభించే దిశగా స్టార్‌లింక్ తీసుకున్న కీలక నిర్ణయంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
వివరాలు
నూతన టెక్ హబ్‌గా ఢిల్లీ
వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను ఎంచుకోవడం ద్వారా, ఢిల్లీ నూతన టెక్ హబ్‌గా మారుతోందని స్పష్టమవుతోంది. అంతర్జాతీయ టెక్ సంస్థలు ఇప్పుడు హోటల్ తరహా సౌకర్యాలు, ఎక్కువ వశ్యత ఉన్న కార్యాలయాల వైపు మొగ్గు చూపుతున్నాయి. నిర్వహిత కార్యాలయాల ద్వారా హైఎండ్ సేవలు అందుబాటులోకి వస్తున్నాయని, ఈ ధోరణి రోజురోజుకూ పెరుగుతోందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఓపెన్‌ఏఐతో ఒకే ప్రాంగణంలో ఉండటం వల్ల, స్టార్‌లింక్ ఢిల్లీ కార్పొరేట్ వర్గాల్లో కీలక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. అయితే, కార్యాలయం ఏర్పాటు అయినప్పటికీ, స్టార్‌లింక్ వాణిజ్య కార్యకలాపాలకు ఇంకా కొన్ని నియంత్రణ అనుమతులు అవసరం.
వివరాలు
స్టార్‌లింక్ ధరలపై కూడా చర్చ
కంపెనీకి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుంచి జీఎంపీసీఎస్ (GMPCS) అనుమతి 2025 జూన్‌లో లభించింది. కానీ స్పెక్ట్రం ధరల విషయంలో ట్రాయ్ (TRAI), డీఓటీ మధ్య ఉన్న భేదాభిప్రాయాల కారణంగా స్టార్‌లింక్‌తో పాటు జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థల లాంచ్ ఆలస్యమవుతోంది. పూర్తి స్థాయి సేవలు ప్రారంభమవడానికి ఇంకా మూడు నుంచి ఆరు నెలలు పట్టవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉండగా, ఇటీవల స్టార్‌లింక్ ధరలపై కూడా చర్చ మొదలైంది. ఈ నెల ఆరంభంలో కంపెనీ భారత వెబ్‌సైట్‌లో నెలకు సుమారు రూ.8,600గా గృహ వినియోగ ప్లాన్ ధరలు కనిపించాయి. అయితే అవి సాంకేతిక లోపం వల్ల వచ్చిన వివరాలేనని సంస్థ స్పష్టం చేసింది.
వివరాలు
శాటిలైట్ ఇంటర్నెట్‌తో పోలిస్తే.. స్టార్‌లింక్ సేవలు భిన్నం
అయినప్పటికీ, భారత్‌లో తక్కువ ధర ఫైబర్ ఇంటర్నెట్ సేవలతో స్టార్‌లింక్ ఎలా పోటీ పడనుందన్న అంశంపై ఆసక్తి పెరిగింది. సాంప్రదాయ శాటిలైట్ ఇంటర్నెట్‌తో పోలిస్తే, స్టార్‌లింక్ సేవలు భిన్నంగా ఉంటాయి. భూమికి దాదాపు 550 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్‌ల ద్వారా సేవలు అందించనుంది. దీనివల్ల వేగవంతమైన, తక్కువ ఆలస్యం ఉన్న ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుంది. ఫైబర్ సదుపాయం లేని దూర ప్రాంతాల్లో గేమింగ్, వీడియో కాల్స్, స్ట్రీమింగ్ వంటి సేవలు సైతం సులభంగా ఉపయోగించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.