Elon Musk: ఏఐ రంగంలో ఆంథ్రోపిక్ దూకుడు.. 'క్లాడ్ కోవర్క్'పై ఎలాన్ మస్క్ ఫైర్
ఈ వార్తాకథనం ఏంటి
'క్లాడ్' చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ తాజాగా 'క్లాడ్ కోవర్క్ ఏజెంట్' అనే కొత్త కృత్రిమ మేధా టూల్‌ను విడుదల చేసింది. లీగల్, సేల్స్, మార్కెటింగ్, డేటా విశ్లేషణ వంటి విభిన్న రంగాల్లో పనులను స్వయంచాలకంగా నిర్వహించేందుకు ఈ ప్లగ్‌ఇన్‌లు ఉపయోగపడనున్నాయని సంస్థ తెలిపింది. ఈ పరిణామాల నేపథ్యంలో, తమ పరిశోధనలు,సాంకేతిక ఆవిష్కరణలను మరింత విస్తరించేందుకు 30 బిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించినట్లు ఆంథ్రోపిక్ ప్రకటించింది. తాజా నిధుల సమీకరణతో కంపెనీ మొత్తం విలువ 380 బిలియన్ డాలర్లకు, అంటే దాదాపు రూ.34 లక్షల కోట్లకు చేరిందని వెల్లడించింది.
వివరాలు
ఆంథ్రోపిక్ ద్వేషభావంతో వ్యవహరిస్తోంది
ఈ ప్రకటనపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆంథ్రోపిక్‌కు చెందిన కృత్రిమ మేధ శ్వేత జాతీయులు, ఆసియన్లు, చైనీయులు, పురుషుల పట్ల ద్వేషభావంతో వ్యవహరిస్తోందని ఆయన సోషల్ మీడియాలో వ్యాఖ్యానించారు. ఇలాంటి దుష్ప్రవర్తనను ముందుగా సరిదిద్దుకోవాలని సూచించారు. అంతేకాక, ఆంథ్రోపిక్ సంస్థ 'మిస్‌ఆంథ్రోపిక్'గా.. ఇతరులను ద్వేషించే సంస్థగా.. మారకుండా అడ్డుకునే సామర్థ్యం దాని యాజమాన్యానికి లేదని విమర్శలు గుప్పించారు.
వివరాలు
ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌ల జాబితాలో ఆంథ్రోపిక్
ఆంథ్రోపిక్ ప్రవేశపెట్టిన 'క్లాడ్ కోవర్క్' కారణంగా మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ స్టార్టప్ ఎక్స్‌ఏఐ కూడా పలు వ్యూహాత్మక మార్పులు చేపడుతున్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అసోసియేటెడ్ ప్రెస్ నివేదిక ప్రకారం, 380 బిలియన్ డాలర్ల విలువతో ఆంథ్రోపిక్ సంస్థ ఓపెన్‌ఏఐ, స్పేస్‌ఎక్స్ వంటి దిగ్గజాలతో పాటు ప్రపంచంలోనే అత్యంత విలువైన స్టార్టప్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది. ప్రముఖ పెట్టుబడి బ్యాంకు రినైసాన్స్ క్యాపిటల్ అయితే, ఆంథ్రోపిక్‌ను ప్రపంచంలో మూడో అత్యంత విలువైన ప్రైవేట్ సంస్థగా పేర్కొంది.