LOADING...
EU: పిల్లలకు హానికరంగా మారుతున్న టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. కఠిన చర్యలకు సిద్ధమైన యూరోపియన్‌ యూనియన్
కఠిన చర్యలకు సిద్ధమైన యూరోపియన్‌ యూనియన్

EU: పిల్లలకు హానికరంగా మారుతున్న టిక్‌టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. కఠిన చర్యలకు సిద్ధమైన యూరోపియన్‌ యూనియన్

వ్రాసిన వారు Sirish Praharaju
May 13, 2026
02:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూరోపియన్‌ యూనియన్‌ (EU) సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలైన టిక్‌ టాక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా పిల్లలను ఆకట్టుకునేలా రూపొందించిన 'అడిక్టివ్‌ డిజైన్‌' ఫీచర్లపై ఆంక్షలు విధించాలని యోచిస్తోంది. డెన్మార్క్‌లో జరిగిన యూరోపియన్‌ సమ్మిట్‌ ఆన్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ చిల్డ్రన్‌ సమావేశంలో ఈ విషయాన్ని EU కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ (Ursula von der Leyen)వెల్లడించారు. టిక్‌టాక్‌లో ఉండే ఎండ్లెస్‌ స్క్రోలింగ్‌, ఆటోప్లే వీడియోలు, పుష్‌ నోటిఫికేషన్లు పిల్లల్లో సోషల్‌ మీడియా వ్యసనాన్ని పెంచుతున్నాయని ఆమె పేర్కొన్నారు. ఇదే పరిస్థితి మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌,ఫేస్‌ బుక్‌ల్లో కూడా ఉందన్నారు. 13 ఏళ్ల కనీస వయస్సు నిబంధనను ఈ సంస్థలు సరిగా అమలు చేయడం లేదని విమర్శించారు.

వివరాలు 

EU వయస్సు నిర్ధారణ యాప్

పిల్లలను హానికర కంటెంట్‌వైపు తీసుకెళ్తున్న ప్లాట్‌ఫాంలపై కూడా EU దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఈటింగ్‌ డిజార్డర్స్‌, సెల్ఫ్‌ హార్మ్‌ను ప్రోత్సహించే వీడియోలను నియంత్రించాల్సిన అవసరం ఉందని తెలిపింది. పిల్లలు ఇలాంటి ప్రమాదకర వీడియోల "రాబిట్‌ హోల్స్‌"లోకి వెళ్లకుండా చర్యలు తీసుకుంటామని వాన్‌ డెర్‌ లేయెన్‌ చెప్పారు. దీనికోసం అధిక ప్రైవసీ ప్రమాణాలతో వయస్సు నిర్ధారణ యాప్‌ను కూడా EU అభివృద్ధి చేసింది. సభ్య దేశాలు దీన్ని డిజిటల్‌ వాలెట్లలో అనుసంధానం చేసుకునే అవకాశం ఉంటుంది.

వివరాలు 

డిజిటల్ ఫెయిర్నెస్ ఆక్ట్ (DFA)

ఇదిలా ఉంటే, ఈ ఏడాది చివర్లో 'డిజిటల్‌ ఫెయిర్‌నెస్‌ యాక్ట్‌ (DFA)'ను తీసుకురావాలని EU భావిస్తోంది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలోని వ్యసనపరచే ఫీచర్లు, మోసపూరిత ఇన్‌ఫ్లూయెన్సర్‌ మార్కెటింగ్‌, యూజర్లను ప్రభావితం చేసే పద్ధతులపై ఈ చట్టం కఠిన నిబంధనలు తీసుకురానుంది. పిల్లల దృష్టిని వ్యాపార వస్తువులా ఉపయోగిస్తున్న బిజినెస్‌ మోడల్స్‌ వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని EU స్పష్టం చేసింది.

Advertisement

వివరాలు 

డిజిటల్ సేవల చట్టం (DSA) బలోపేతం

ఇప్పటికే అమల్లో ఉన్న డిజిటల్‌ సర్వీసెస్‌ యాక్ట్‌ (DSA) కింద పెద్ద సోషల్‌ మీడియా సంస్థలపై విచారణ కొనసాగుతోంది. టిక్‌టాక్‌, ఎక్స్‌ (మాజీ ట్విట్టర్‌), మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లపై EU దర్యాప్తు చేస్తోంది. ముఖ్యంగా ఎక్స్‌లో గ్రోక్‌ AI వినియోగంతో మార్ఫింగ్‌ చేసిన అశ్లీల చిత్రాలు వ్యాప్తి చెందుతున్నాయన్న ఆరోపణలపై కూడా విచారణ కొనసాగుతోంది.

Advertisement