China Grows Rice In Space : అంతరిక్షంలోనే వ్యవసాయం..! వరి పండించి కోత కోసిన చైనా
ఈ వార్తాకథనం ఏంటి
భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లోనే పంటలు పండించి.. వ్యోమగాములు అక్కడే ఆహారం తయారు చేసుకునే రోజులు రానున్నాయా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ దిశగా శాస్త్రవేత్తలు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా చైనా చేపట్టిన ప్రయోగం విజయవంతమైంది. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న చైనా 'తియాంగాంగ్' అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు తొలిసారి వరి పంటను విజయవంతంగా పండించారు. విత్తనం నాటడం నుంచి ధాన్యాన్ని సేకరించే వరకు వరి పూర్తి జీవచక్రాన్ని అంతరిక్షంలోనే పూర్తి చేసి కీలక మైలురాయిని అధిగమించారు. చైనా చేపట్టిన షెంజౌ-23 మిషన్‌లో భాగంగా మే 24న వరి విత్తనాలను తియాంగాంగ్ స్పేస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ రెండు నెలలకు పైగా సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో వాటిని పెంచారు.
వివరాలు
మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో మొక్కల పెరుగుదల..
అనంతరం వ్యోమగాములు జూ యాంగ్జు, జాంగ్ జియువాన్, లై కైయింగ్ తొలి వరి నమూనాలను సేకరించారు.
అంతరిక్ష ఇంక్యుబేటర్లలో ప్రత్యేక ఎల్‌ఈడీ లైట్లను ఉపయోగించడంతో పాటు.. ద్రవ పోషకాల ద్వారా నీరు, ఎరువులను అందిస్తూ వరి పంటను పెంచారు.
సాధారణంగా భూమిపై గురుత్వాకర్షణ ప్రభావం వల్ల మొక్కల వేళ్లు కిందికి, కాండం పైకి పెరుగుతాయి.
అయితే అంతరిక్షంలోని మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో మొక్కల పెరుగుదల తీరు మారుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఈ ప్రయోగంలో చైనా శాస్త్రవేత్తలు రెండు రకాల జపోనికా వరి విత్తనాలను ఉపయోగించారు.
వీటిలో ఒకటి అంతరిక్షానికి ఎప్పుడూ వెళ్లని సాధారణ విత్తనాలు కాగా.. మరొకటి 2022లో తియాంగాంగ్ అంతరిక్ష కేంద్రంలో పండించిన వరి నుంచి సేకరించిన విత్తనాలు.
వివరాలు
ఆక్సిజన్‌ను విడుదల చేసే ప్రక్రియ..
గతంలో అంతరిక్ష వాతావరణాన్ని ఎదుర్కొన్న విత్తనాలు.. తరువాతి తరాల్లో ఎలా స్పందిస్తాయన్న అంశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.
2022లోనే చైనా అంతరిక్షంలో తొలిసారిగా వరి పూర్తి జీవచక్ర ప్రయోగాన్ని నిర్వహించింది.
ఆ సమయంలో ఆరు వరి విత్తనాలను 120 రోజులపాటు కక్ష్యలో పెంచారు.
ఈ ప్రయోగం ద్వారా 59 కొత్త విత్తనాలు లభించాయి. వాటిని భూమికి తీసుకొచ్చి తదుపరి పరిశోధనలు చేపట్టారు.
తాజా ప్రయోగం ద్వారా అంతరిక్షంలోనే ఆహారాన్ని పండించే అవకాశం మాత్రమే కాకుండా.. వ్యోమగాములు విడుదల చేసే కార్బన్ డైఆక్సైడ్‌ను మొక్కలు గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేసే ప్రక్రియను కూడా కొనసాగించవచ్చని తేలింది.
అలాగే నీటి వ్యవస్థను సహజసిద్ధంగా శుద్ధి చేసుకునే అవకాశం కూడా ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న పోస్ట్..
Aiming for world's first two-generation rice cultivation in orbit! China's Shenzhou-23 astronauts have completed a new rice-growing experiment aboard China's space station, comparing two types of rice seeds to advance space farming. pic.twitter.com/oyzfMxbRSz
— LI Jian (@Europe_MFA_CHN) August 3, 2026