అంతరిక్ష కేంద్రం కోసం కొత్త సిబ్బంది.. నాలుగు దేశాల నుండి నలుగురు వ్యోమగాములు
అమెరికా కేప్ కెనవెరాల్‌లోని కెనడీ స్పేస్ సెంటర్ నుండి నాలుగు దేశాలకు చెందిన నలుగురు వ్యోమగాములు శనివారం 'స్పేస్‌ఎక్స్' రాకెట్‌లో నింగిలోకి దూసుకెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లిన వారిలో నాసా తో పాటు డెన్మార్క్, జపాన్,రష్యాలకు చెందిన వ్యోమగాములు ఉన్నారు. ఇప్పటివరకు నాసా చేసిన ప్రతి ప్రయోగంలోను అమెరికా తన వ్యోమగాములనే పంపేది. శనివారం నింగిలోకి వెళ్లిన నలుగురు వ్యోమగాములు ఆర్నెళ్ల పాటు 'ఐఎస్‌ఎస్'లో విధులు నిర్వహించనున్నారు. మార్చి నుంచి 'ఐఎస్‌ఎస్'లో ఉన్న వ్యోమగాములను వీరి బృందం భర్తీ చేయనున్నారు. ఈ మిషన్‌కు నాసాకు చెందిన జాస్మిన్ మోఘ్‌బెలి కమాండర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇరాన్ అమ్మాయిలూ ఏదైనా సాధిస్తారని నిరూపిస్తా: జాస్మిన్ మోఘ్‌బెలి
1979 ఇరాన్ రెవల్యూషన్ సమయంలో ఆమె తల్లిదండ్రులు జర్మనీకి వెళ్లారు. జర్మనీలో పుట్టి,న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో పెరిగిన ఆమె మెరైన్స్‌లో చేరి ఆఫ్ఘనిస్తాన్‌లో అటాక్ హెలికాప్టర్లను నడిపింది. మొదటిసారి అంతరిక్ష యాత్రకు ఎంపికైనా మోఘ్‌బెలి ఇరాన్ అమ్మాయిలూ ఏదైనా సాధిస్తారని తాను నిరూపించనున్నట్లు చెప్పారు. డెన్మార్క్ వాసి,యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఆంద్రియాస్ మొగెన్‌సెన్.. జపాన్ కి చెందిన సతోషి ఫురుకావా.. రష్యాకు చెందిన కాన్‌స్టాంటిన్ బొరిసోవ్ ఇతర వ్యోమగాములు. నిజానికి శుక్రవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్న క్యాప్సూల్ 'లైఫ్ సపోర్ట్ సిస్టమ్' అదనపు సమీక్షల కారణంగా ప్రయోగం ఆలస్యమైంది. మరో నాసా వ్యోమగామి ఇద్దరు రష్యన్‌లతో కలిసి బార్టర్ ఒప్పందం ప్రకారం సెప్టెంబర్ మధ్యలో కజకిస్తాన్ నుండి స్టేషన్‌కు చేరుకుంటారు.