LOADING...
One Day 25 Hours: కాల గడియారం మారబోతుంది.. రోజుకు 25 గంటలు.. షాకింగ్ విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు
షాకింగ్ విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు

One Day 25 Hours: కాల గడియారం మారబోతుంది.. రోజుకు 25 గంటలు.. షాకింగ్ విషయాన్ని వెల్లడించిన పరిశోధకులు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 30, 2025
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

సమయం అనేది మన జీవితం లో అత్యంత అమూల్యమైన సంపద. ధనికుడైనా, పేదవాడైనా ప్రతి ఒక్కరికీ రోజుకు దక్కే సమయం మాత్రం ఒకటే. ఒకసారి గడిచిపోయిన సమయం మళ్లీ తిరిగి రావడం అసాధ్యం. అందుకే సమయం ఉన్నప్పుడే దానిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి క్షణాన్నీ విలువైనదిగా భావించి వృథా చేయకూడదని పెద్దలు చెబుతుంటారు. కాలగణన ప్రకారం మనం ఇప్పటివరకు సమయాన్ని గంటల ఆధారంగా లెక్కిస్తూ వచ్చాం. రోజును 24 గంటలుగా విభజించి కాలాన్ని గణిస్తున్నాం. అయితే ఈ సంప్రదాయ లెక్కలో త్వరలోనే మార్పు వచ్చే అవకాశముందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వివరాలు 

భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా తగ్గుతోంది 

సాధారణంగా భూమి తన అక్షంపై తిరిగే వేగాన్ని ఆధారంగా చేసుకుని ఒక రోజు ఎంత సమయం అనేది నిర్ణయిస్తారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా తగ్గుతూ వస్తోందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ ఇదే విధంగా కొనసాగితే, భవిష్యత్తులో ఒక రోజు వ్యవధి 25 గంటలకు చేరుకునే అవకాశం ఉందని జర్మనీలోని మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీతో పాటు అమెరికాలోని విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు వెల్లడించారు. ఈ మార్పుకు ప్రధాన కారణం భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడు ప్రతి ఏడాది సుమారు 3.8 సెంటీమీటర్ల మేర భూమి నుంచి క్రమంగా దూరమవుతోంది.

వివరాలు 

భూమి భ్రమణ వేగం ఎక్కువగా ఉండేది 

దీనివల్ల భూమి-చంద్రుల మధ్య ఉన్న గురుత్వాకర్షణ శక్తిలో మార్పులు ఏర్పడుతున్నాయి. ఆ ప్రభావం సముద్రాలపై పడుతూ జలచలనంలో మార్పులకు దారితీస్తోంది. సముద్రాల్లో ఏర్పడే అలల కారణంగా భూమి తన అక్షంపై తిరిగే వేగం నెమ్మదిగా తగ్గుతోందని పరిశోధకులు వివరిస్తున్నారు. రింగ్ లేజర్ జైరోస్కోప్ అనే అత్యాధునిక పరికరం ద్వారా ఈ సూక్ష్మ మార్పులను గుర్తించినట్లు వారు తెలిపారు. ఇలాంటి పరిణామాలు భూమి చరిత్రలో గతంలో కూడా చోటుచేసుకున్నాయని శాస్త్రవేత్తలు గుర్తు చేస్తున్నారు. సుమారు 140 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్న సమయంలో భూమి భ్రమణ వేగం ఎక్కువగా ఉండేదని,అప్పట్లో ఒక రోజు పూర్తవడానికి కేవలం 18 గంటలే పట్టేవని చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

దాదాపు 20 కోట్ల సంవత్సరాలు పట్టే అవకాశం

ఆ తరువాత చంద్రుడు క్రమంగా దూరమవుతున్న కొద్దీ భూమి వేగం తగ్గుతూ వచ్చి, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న 24 గంటల రోజుకు చేరుకుందని వివరించారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఒక రోజు వ్యవధి 25 గంటలుగా మారేందుకు ఇంకా దాదాపు 20 కోట్ల సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. ఒకవేళ భవిష్యత్తులో ఇది నిజమైతే,అప్పటి తరాల జీవితాలపై గణనీయమైన ప్రభావం ఉండవచ్చని హెచ్చరిస్తున్నారు. 25 గంటల రోజుకు అనుగుణంగా క్యాలెండర్లు, అటామిక్ క్లాక్స్, జీపీఎస్ వంటి అత్యంత ఖచ్చితమైన సమయ వ్యవస్థలను తిరిగి రూపొందించాల్సి వస్తుందని అంటున్నారు.

Advertisement

వివరాలు 

నిద్ర అలవాట్లు, జీవక్రియలు, జీవవైవిధ్యంపై కూడా దీర్ఘకాలంలో ప్రభావం

అలాగే విమానయాన రంగం, అంతరిక్ష ప్రయాణాల సమయపాలన, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు, అంతర్జాతీయ సమయమానం (UTC) వంటి రంగాల్లోనూ మార్పులు తప్పవని సూచిస్తున్నారు. విద్యార్థుల పాఠశాల సమయాలు, ఉద్యోగుల పనివేళలు, కర్మాగారాల షిఫ్టులు మారే అవకాశముండటంతో పాటు, నిద్ర అలవాట్లు, జీవక్రియలు, జీవవైవిధ్యంపై కూడా దీర్ఘకాలంలో ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement