
Gmail new feature: జీమెయిల్‌లో కొత్త ఫీచర్.. ప్రమోషనల్ మెయిల్స్‌ను ఒక్క క్లిక్‌తో అడ్డుకోవచ్చు!
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన ఇ-మెయిల్ సర్వీస్ అయిన జీమెయిల్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మేనేజ్ సబ్‌స్క్రిప్షన్ (Manage Subscriptions) అనే పేరుతో ఈ ఫీచర్‌ను ప్రారంభించారు. ఈ సదుపాయం ద్వారా యూజర్లు తమ ప్రమోషనల్ ఇ-మెయిల్స్‌ను ఒకేచోట చూడగలిగే అవకాశం కల్పించారు. అవసరం లేని సబ్‌స్క్రిప్షన్‌లను ఒక్క క్లిక్‌తో ఆపేయడాన్ని గూగుల్ సులభతరం చేసింది. ఇకపై ఇష్టంలేని ప్రమోషనల్ మెయిల్స్ మీ ఇన్‌బాక్స్‌లోకి రాకుండా నియంత్రించుకునే సౌలభ్యం ఈ ఫీచర్ ద్వారా లభిస్తుందని గూగుల్ తన అధికారిక బ్లాగ్‌లో వెల్లడించింది. ప్రస్తుతం వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.
వివరాలు
ఎక్కువగా మెయిల్స్ పంపుతున్న సబ్స్క్రిప్షన్‌లను ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంది
జీమెయిల్ సైడ్ మెనూలో ట్రాష్ ఫోల్డర్ క్రింద మేనేజ్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ కనబడుతుంది. దీన్ని ఓపెన్ చేస్తే యూజర్‌కి ఉన్న అన్ని యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్‌ల వివరాలు చూపిస్తాయి. న్యూస్‌లెటర్స్, ప్రమోషనల్ మెసేజ్‌లు, డీల్ అలర్ట్స్ వంటి వాటన్నింటినీ ఇందులో లిస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి సబ్స్క్రిప్షన్ ద్వారా యూజర్‌కి ఎంతవరకూ మెయిల్స్ వస్తున్నాయో స్పష్టంగా చూపించడమే కాకుండా, ఎక్కువగా మెయిల్స్ పంపుతున్న సబ్స్క్రిప్షన్‌లను ప్రత్యేకంగా హైలైట్ చేస్తుంది. ఎవరైనా ఒక సబ్స్క్రిప్షన్‌పై ట్యాప్ చేస్తే, ఆ సబ్స్క్రిప్షన్ ద్వారా వచ్చిన అన్ని మెయిల్స్‌ను చూపిస్తుంది. వాటి పక్కనే ఉన్న అన్‌సబ్‌స్క్రైబ్ బటన్ ద్వారా వాటిని తేలికగా నిలిపివేయవచ్చు.
వివరాలు
జీమెయిల్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్ అందుబాటులో..
ఇంతకుముందు మెయిల్స్ చివర భాగంలో ఉండే చిన్న అన్‌సబ్‌స్క్రైబ్ లింక్‌ను వెతకాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ కొత్త ఫీచర్‌తో గూగుల్ స్వయంగా అన్‌సబ్‌స్క్రైబ్ అభ్యర్థనను పంపించేలా సదుపాయం కల్పించింది. ఈ ఫీచర్‌ను గత ఏప్రిల్ నెలలో కొద్ది మంది యూజర్లతో పరీక్షించగా, ఇప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. జీమెయిల్ వాడుతున్న ప్రతి ఒక్కరికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీ జీమెయిల్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేయండి. అవసరం లేని మెయిల్స్‌కు ఇక వెంటనే గుడ్‌బై చెప్పండి!