LOADING...
Ozempic :మధుమేహులకు శుభవార్త.. నోవో నార్డిస్క్ 'ఓజెంపిక్' భారత్‌లో లాంచ్!
మధుమేహులకు శుభవార్త.. నోవో నార్డిస్క్ 'ఓజెంపిక్' భారత్‌లో లాంచ్!

Ozempic :మధుమేహులకు శుభవార్త.. నోవో నార్డిస్క్ 'ఓజెంపిక్' భారత్‌లో లాంచ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2025
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

డానిష్‌ ఔషధ దిగ్గజం నోవో నార్డిస్క్ భారత్‌లో తమ బ్లాక్‌బస్టర్ యాంటీ-టైప్-2 డయాబెటిస్ ఔషధం 'ఓజెంపిక్' (సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్)ను అధికారికంగా లాంచ్ చేసింది. అధిక బరువు నియంత్రణలో కూడా వాడే ఈ ఇంజెక్షన్‌ను 0.25 మిల్లీగ్రామ్ డోస్‌కు వారానికి రూ. 2,200 ప్రారంభ ధరతో భారత మార్కెట్‌లో విడుదల చేస్తున్నట్లు సంస్థ శుక్రవారం ప్రకటించింది. మూడు డోసేజ్ రూపాల్లో 0.25 మి.గ్రా, 0.5 మి.గ్రా, 1 మి.గ్రా — ఈ ఔషధం అందుబాటులో ఉంది. నొప్పిలేని సబ్‌క్యూతేనియస్ ఇంజెక్షన్ ఇవ్వడానికి రూపొందించిన నోవోఫైన్ నీడిల్స్ సాయంతో ఇది సింగిల్-యూజ్ ప్రీ-ఫిల్డ్ పెన్ రూపంలో లభిస్తుంది. చికిత్సను మొదటి 4 వారాలు 0.25 మి.గ్రా వారానికి ఒక్కసారి డోస్‌తో ప్రారంభిస్తారు.

Details

ధరలు ఇలా

ఆ తర్వాత కనీసం 4 వారాలపాటు 0.5 మి.గ్రా వారానికి ఒక్కసారి డోసేజ్ ఇస్తారు. అనంతరం రోగులు 1 మి.గ్రా వారానికి ఒకసారి వరకు తీసుకోవచ్చు. ఈ ప్రీ-ఫిల్డ్ పెన్ నాలుగు మోతాదులతో వస్తుందని కంపెనీ వివరించింది. 0.25 mg నెలసరి ధర — ₹8,800 (వారానికి ₹2,200) 0.5 mg నెలసరి ధర — ₹10,170 (వారానికి ₹2,542.50) 1 mg నెలసరి ధర — ₹11,175 (వారానికి ₹2,793.75) భారతదేశంలో ఇది ఇన్సులిన్ ధరల పైనే అందుబాటులో ఉందని, ఇది వైద్యరంగంలో ఒక కీలక ఘట్టం అని నోవో నార్డిస్క్ ఇండియా కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ & మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియ పేర్కొన్నారు.

Details

వైద్య చరిత్రలో ప్రధాన మార్పు

పెన్సిలిన్, యాంటీబయాటిక్స్ ఆవిష్కరణలు ఇచ్చిన ప్రభావానికి సమానంగా ఈ ఔషధం కూడా వైద్య చరిత్రలో ప్రధాన మార్పుకు దారి తీస్తుందని ఆయన అభివర్ణించారు. 'ఓజెంపిక్‌ను ఈ ధర శ్రేణిలో అందుబాటులోకి తేవడం చాలా కష్టతరమైన పని' అని చెప్పారు. భారత వైద్యుల సూచన మేరకు అధిక సంఖ్యలో రోగులు ఈ చికిత్సను ఉపయోగిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. చైనా తర్వాత అతి పెద్ద టైప్-2డయాబెటిస్ రోగుల జనాభా భారత్‌లోనే ఉంది. వేగంగా పెరుగుతున్న ఊబకాయం రేట్లు, బరువు తగ్గించే చికిత్సల మార్కెట్ విస్తరణ మధ్య, భారతదేశం ఇప్పుడు ప్రపంచ ఔషధ కంపెనీలకు కీలకమైన యుద్ధభూమిగా మారింది. ప్రపంచ బరువు తగ్గించే ఔషధ మార్కెట్ దశాబ్దం చివరినాటికి సంవత్సరానికి 150బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశముందని అంచనా.

Advertisement