LOADING...
Microsoft: విండోస్‌ 10కు గుడ్‌బై.. ఇకపై అప్‌డేట్స్‌ లేవని స్పష్టం చేసిన మైక్రోసాఫ్ట్‌!
విండోస్‌ 10కు గుడ్‌బై.. ఇకపై అప్‌డేట్స్‌ లేవని స్పష్టం చేసిన మైక్రోసాఫ్ట్‌!

Microsoft: విండోస్‌ 10కు గుడ్‌బై.. ఇకపై అప్‌డేట్స్‌ లేవని స్పష్టం చేసిన మైక్రోసాఫ్ట్‌!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 04, 2025
02:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

మైక్రోసాఫ్ట్‌ ఇకపై విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌కు(Windows 10 OS)అప్‌డేట్‌లు, సపోర్ట్ అందించడం నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విండోస్‌ 11ను విడుదల చేసి సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ లక్షలాది మంది వినియోగదారులు విండోస్‌ 10నే ఉపయోగిస్తున్నారు. ఇకపై వారు ఎటువంటి సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌లు, సపోర్ట్ పొందరని స్పష్టం చేసింది. దీని వల్ల విండోస్‌ 10 ఉపయోగిస్తున్న పీసీలు భద్రతా పరంగా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విండోస్‌ 10 వినియోగదారులకు ఇది కీలక పరిణామం. 2015లో విడుదలైన విండోస్‌ 10కు మైక్రోసాఫ్ట్‌ అక్టోబర్‌ 14, 2025 నుంచి అధికారిక మద్దతును పూర్తిగా ముగించనుంది. ఈనేపథ్యంలో వినియోగదారులు వీలైనంత త్వరగా విండోస్‌ 11కి అప్‌గ్రేడ్‌ అవ్వాలని సూచిస్తోంది.

Details

కంప్యూటర్లు పనిచేయడం ఆగిపోతాయా? 

విండోస్‌ 10 సపోర్ట్‌ నిలిచిపోవడం వల్ల పీసీలు పని చేయవని కాదు. సిస్టమ్‌ యథావిధిగా పనిచేస్తుంది. కానీ భద్రతా అప్‌డేట్‌లు అందకపోవడం, కొత్త ఫీచర్లు లేకపోవడం వలన హ్యాకర్లకు సులభ లక్ష్యమవుతుంది. ముఖ్యంగా పాత సిస్టమ్‌లు RAM, CPU అనుకూలత లేదా TPM 2.0 లేకపోవడం వలన విండోస్‌ 11కి అప్‌గ్రేడ్‌ అవ్వడం అసాధ్యం కావచ్చు. అటువంటి సందర్భాల్లో వినియోగదారులు Linux లేదా Chrome OS వంటి ప్రత్యామ్నాయ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లను ఎంచుకోవాల్సి వస్తుంది.

Details

నిపుణుల హెచ్చరికలు

నిపుణులు విండోస్‌ 10 వినియోగదారులు తక్షణమే విండోస్‌ 11కి మారాలని సూచిస్తున్నారు. దీని వల్ల భద్రతా అప్‌డేట్‌లతో పాటు కొత్త ఫీచర్లు, మెరుగైన పనితీరు పొందవచ్చు. ముఖ్యంగా ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ చేసే వినియోగదారులు తప్పనిసరిగా కొత్త వెర్షన్‌కి అప్‌గ్రేడ్‌ కావాలని నిపుణులు అంటున్నారు

Details

మైక్రోసాఫ్ట్‌ భరోసా 

అయితే మైక్రోసాఫ్ట్‌ 2028 అక్టోబర్‌ వరకు ప్రాథమిక భద్రతా నిఘా అప్‌డేట్‌లు అందిస్తామని తెలిపింది. ఇవి పూర్తి భద్రత కల్పించవు. వినియోగదారులు మరింత రక్షణ కోరితే Extended Security Updates (ESU) ప్రోగ్రాంలో చేరాలి. దీనికోసం అదనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల విండోస్‌ 10 వినియోగదారులు ఇప్పుడు నుంచే తమ పీసీలను సురక్షితంగా ఉంచుకోవడానికి చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.