Page Loader
Google Store: ఇకపై గూగుల్ వెబ్‌సైట్‌ నుంచే పిక్సెల్‌ ఫోన్లు, వాచ్‌లు విక్రయం
ఇకపై గూగుల్ వెబ్‌సైట్‌ నుంచే పిక్సెల్‌ ఫోన్లు, వాచ్‌లు విక్రయం

Google Store: ఇకపై గూగుల్ వెబ్‌సైట్‌ నుంచే పిక్సెల్‌ ఫోన్లు, వాచ్‌లు విక్రయం

వ్రాసిన వారు Sirish Praharaju
May 29, 2025
02:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్‌ సంస్థ ఇకపై భారత మార్కెట్లో తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, గూగుల్‌ తన అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఇప్పటివరకు ఇతర ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్‌లపై ఆధారపడుతూ వచ్చిన గూగుల్‌.. ఇకపై స్వంతంగా డెలివరీ సేవలను ప్రారంభించనుంది. భారతదేశంలో తమ మార్కెట్‌ ఉనికిని మరింత బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ఈ చర్యలను చేపట్టింది. ఇప్పటిదాకా గూగుల్‌ తన పరికరాలను ఫ్లిప్‌కార్ట్‌, టాటా గ్రూప్‌కు చెందిన క్రోమా,అలాగే రిలయన్స్ డిజిటల్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థల సహాయంతో విక్రయించేది. ఇప్పుడు మాత్రం,కొత్తగా ప్రారంభించిన ఆన్‌లైన్‌ స్టోర్‌ ద్వారా నేరుగా తమ గ్యాడ్జెట్లను వినియోగదారుల చెంతకు తీసుకురానుంది.

వివరాలు 

యూజర్లకు అందుబాటులోకి గూగుల్‌ వెబ్‌సైట్‌ 

ఇప్పటికే ఈ కొత్త గూగుల్‌ వెబ్‌సైట్‌ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులు ఈ వెబ్‌సైట్‌ ద్వారా పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లు, పిక్సెల్‌ వాచ్‌లు, పిక్సెల్‌ బడ్స్‌ వంటివి నేరుగా గూగుల్‌ నుంచే కొనుగోలు చేయవచ్చు. భారత మార్కెట్లో నేరుగా విక్రయాలను ప్రారంభించిన సందర్భంగా గూగుల్‌ ఇండియా డివైజెస్‌ అండ్‌ సర్వీసెస్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ మితుల్ షా సంతోషం వ్యక్తం చేశారు. భారత్‌ పిక్సెల్‌ పరికరాలకు ఒక కీలక మార్కెట్‌గా మారిందని పేర్కొన్న ఆయన.. మున్ముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరికరాలతో తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నట్లు వెల్లడించారు. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలను అందించడంపై సంస్థ ప్రధానంగా దృష్టి పెట్టిందని తెలిపారు.

వివరాలు 

ఆఫ్‌లైన్‌ స్టోర్‌లను కూడా ప్రారంభించే యోచన

అంతేకాదు, త్వరలో ఆఫ్‌లైన్‌ స్టోర్‌లను కూడా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు చెప్పారు. అయితే, ఆ స్టోర్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయాన్ని మితుల్ షా స్పష్టంగా తెలియజేయలేదు. ప్రస్తుతం ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో ఆపిల్‌, శాంసంగ్‌, గూగుల్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే శాంసంగ్‌, ఆపిల్‌ సంస్థలు భారత్‌లోనే తమ ఉత్పత్తులను తయారు చేయడమే కాకుండా, స్వంతంగా రిటైల్‌ స్టోర్లను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు గూగుల్‌ కూడా అదే దారిలో ముందుకు సాగుతూ ఈ జాబితాలోకి చేరినట్టు చెప్పవచ్చు.