Google: జనవరి 2027 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ యాప్‌లకు గూగుల్ వెరిఫికేషన్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ కీలక మార్పులు తీసుకురాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ యాప్ డెవలపర్ల వెరిఫికేషన్ విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. 2027 జనవరి నుంచి ఈ నిబంధనలను దశలవారీగా అమల్లోకి తీసుకురానుంది. డెవలపర్లు, యూజర్ల నుంచి ఈ విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ గూగుల్ వెనక్కి తగ్గడం లేదు. గత సెప్టెంబరులోనే బ్రెజిల్, ఇండోనేషియా, సింగపూర్, థాయ్‌లాండ్ దేశాల్లో ఈ విధానాన్ని ప్రారంభించింది. రానున్న కొన్ని నెలల్లో ప్రపంచవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించింది.
వివరాలు
ప్లే స్టోర్ వెలుపలి యాప్‌లకూ వెరిఫికేషన్ తప్పనిసరి
గూగుల్ తీసుకొస్తున్న కొత్త వెరిఫికేషన్ నిబంధనలు కేవలం ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే యాప్‌లకే పరిమితం కావు.
ఇతర వెబ్‌సైట్లు, థర్డ్ పార్టీ యాప్ స్టోర్ల నుంచి ఇన్‌స్టాల్ చేసుకునే యాప్‌లకూ ఇవి వర్తిస్తాయి.
ఒక ప్రాంతంలో డెవలపర్ వెరిఫికేషన్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత, గూగుల్ వద్ద రిజిస్టర్ చేసుకున్న డెవలపర్లు రూపొందించిన యాప్‌లను మాత్రమే సైడ్‌లోడింగ్ ద్వారా ఇన్‌స్టాల్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇందుకోసం డెవలపర్లు ప్రభుత్వ గుర్తింపు కార్డును సమర్పించడంతో పాటు 25 డాలర్లు (సుమారు రూ.2,100) రుసుము చెల్లించి తమ యాప్‌ను గూగుల్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
వివరాలు
ఇప్పటికే ఆండ్రాయిడ్ ఫోన్లలో అమల్లోకి వచ్చిన విధానం
గూగుల్ వెరిఫికేషన్ విధానం ఇప్పటికే ఆండ్రాయిడ్ 8 ఓరియో లేదా ఆ తర్వాతి వెర్షన్లతో పనిచేసే గూగుల్ సర్టిఫైడ్ పరికరాల్లో అమల్లోకి వచ్చింది.
చైనా, రష్యా మినహా ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని ఆండ్రాయిడ్ పరికరాలకు ఈ నిబంధనలు వర్తించనున్నాయి.
ఈ విధానాన్ని అమలు చేసేందుకు గెలాక్సీ స్టోర్, హానర్, ఒప్పో, షావోమీ, ట్రాన్షన్, వివో వంటి ప్రముఖ థర్డ్ పార్టీ యాప్ స్టోర్లతోనూ గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది.
వివరాలు
నిబంధనల నుంచి మినహాయింపు పొందే అవకాశం
కొత్త నిబంధనలపై యూజర్ల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న గూగుల్ తాజాగా మరో అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది.
యాప్‌ల ఇన్‌స్టాలేషన్‌పై పరిమితులు వద్దనుకునే వారికి 'అడ్వాన్స్‌డ్ ఫ్లో' పేరుతో ప్రత్యేక ఆప్షన్‌ను తీసుకొచ్చింది.
దీని ద్వారా డెవలపర్ వెరిఫికేషన్ పూర్తయిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా యూజర్లు తమకు కావాల్సిన యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.
అయితే ఈ ఆప్షన్‌ను సులభంగా యాక్సెస్ చేసే అవకాశం ఉండదు. అంతేకాకుండా, దీనివల్ల ఎదురయ్యే భద్రతాపరమైన ముప్పుల గురించి గూగుల్ పలు హెచ్చరికలు కూడా చూపించనుంది.