
Google AI: గూగుల్ సెర్చ్‌లో తెలుగుకు పెద్దపీట.. ఏఐ మోడ్‌లో అందుబాటులోకి ఏడు భారతీయ భాషలు
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ భారతీయ వినియోగదారులకు ఒక కీలకమైన అప్‌డేట్‌ని ప్రకటించింది. బుధవారం, తన ఏఐ ఆధారిత సెర్చ్ అనుభవాన్ని తెలుగు సహా ఏడు కొత్త భారతీయ భాషల్లో విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఈ మార్పుతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు తమకు ఇష్టమైన భాషలో మరింత సులభంగా, లోతైన, ప్రామాణిక సమాచారాన్ని పొందగలుగుతారు. ఇప్పటివరకు కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్న 'ఏఐ మోడ్' సేవలు, ఇకపై తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ,ఉర్దూ భాషల్లో కూడా లభ్యమవుతాయి. దీని వల్ల వినియోగదారులు సంక్లిష్టమైన అంశాలపై మరింత సుదీర్ఘమైన సంభాషణల రూపంలో ప్రశ్నలు అడిగి, వివరమైన సమాధానాలు పొందగలుగుతారు.
వివరాలు
అమెరికా తర్వాత ఈ ఫీచర్ అందుకున్న తొలి దేశం భారత్
గూగుల్ తెలిపిన ప్రకారం, స్థానిక భాషల నుడికారాలు, సూక్ష్మ వ్యత్యాసాలను అర్థం చేసుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించిన జెమిని మోడల్ ద్వారా ఈ ఫీచర్ అభివృద్ధి చేయబడింది. ఈ కొత్త భాషల విస్తరణ రాబోయే వారంలో అందుబాటులోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. భాషల విస్తరణతో పాటు, గూగుల్ ఒక కొత్త ఫీచర్ 'సెర్చ్ లైవ్'ను కూడా ప్రారంభించింది. ఈ ఫీచర్ వాయిస్,కెమెరా ద్వారా నేరుగా సెర్చ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అమెరికాకు అనంతరం భారత్ ఈ అత్యాధునిక ఫీచర్ అందుకున్న తొలి దేశం కావడం గమనార్హం. వినియోగదారు కెమెరా ద్వారా ఏదైనా వస్తువును చూపించి, దాని ఉపయోగం లేదా వివరాలను వాయిస్ ద్వారా అడిగితే తక్షణమే సమాధానం పొందవచ్చు.
వివరాలు
బుధవారం నుంచే 'సెర్చ్ లైవ్' ఫీచర్
'సెర్చ్ లైవ్' ఫీచర్ దశలవారీగా బుధవారం నుంచే విడుదల అవుతుంది. దీన్ని ఉపయోగించడానికి గూగుల్ యాప్ లేదా గూగుల్ లెన్స్‌లోని 'లైవ్' ఐకాన్‌పై నొక్కితే సరిపోతుంది. గూగుల్ ఈ అప్‌డేట్‌లను భారతీయ వినియోగదారులకు సెర్చ్ అనుభవాన్ని మరింత సహజం, వేగవంతం,సులభం చేయడానికి రూపొందించిందని స్పష్టంగా తెలిపింది.