Google I/O 2025: గూగుల్ మీట్‌లో రియల్ టైమ్ ట్రాన్స్‌లేట్ ఫీచర్.. అసలేంటీ ఫీచర్? ఎలా ఉపయోగపడనుందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన వార్షిక డెవలపర్ ఈవెంట్ అయిన Google I/O 2025లో పలు సరికొత్త సదుపాయాలను ప్రకటించింది.
వాటిలో గూగుల్ మీట్‌కు సంబంధించిన కొత్త ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సమావేశంలో గూగుల్ "రియల్ టైమ్ ట్రాన్స్‌లేట్"అనే ఆధునిక ఫీచర్‌ను గూగుల్ మీట్ యాప్‌లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
ఈ సాంకేతికతను గూగుల్ తాజా జెమినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ఆధారంగా అభివృద్ధి చేసింది.
ఈ కొత్త ఫీచర్ వివరాలను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ డెవలపర్ కాన్ఫరెన్స్‌లో స్వయంగా ప్రదర్శించారు.
ఆయన చిన్న డెమో వీడియోను ప్రజెంట్ చేస్తూ,ఈ ఫీచర్ కేవలం క్యాప్షన్లను అనువదించడంలో మాత్రమే పరిమితమయ్యేది కాదని,దీనివల్ల మాట్లాడే వ్యక్తి స్వరం,భావోద్వేగం,శైలి మొదలైన వాటిని కూడా అనుకరించి అనువదించగలదని వివరించారు.
వివరాలు
సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులకు అందుబాటులోకి ఈ ఫీచర్
ఇది వీడియో కాల్‌లో పాల్గొంటున్న విభిన్న భాషలు మాట్లాడే వ్యక్తులు ఒకరినొకరు సులభంగా అర్థం చేసుకునేలా చేస్తుందని చెప్పారు.
ఉదాహరణగా, మీరు గూగుల్ మీట్ వీడియో కాల్‌లో ఆంగ్లంలో మాట్లాడుతుంటే, టీమ్‌లో మరో వ్యక్తి స్పానిష్ భాషలో స్పందిస్తే, ఆ వ్యక్తి మాటలను గూగుల్ మీట్‌లోని AI తక్షణమే ఆంగ్లంలోకి అనువదించి వినిపిస్తుంది. ఇది కేవలం టెక్స్ట్ రూపంలో మాత్రమే కాకుండా, ఆడియో రూపంలోనూ వినిపిస్తుంది. అంతేకాకుండా, మీరు తెలుగులో ఇచ్చే సమాధానాన్ని ఆ స్పానిష్ మాట్లాడే వ్యక్తికి స్పానిష్ భాషలో, మీ స్వరాన్ని అనుకరించే విధంగా అందిస్తుంది. ఇది అంతా రియల్ టైమ్‌లో జరుగుతుంది.
ఈ ఫీచర్‌ను గూగుల్ తమ "ఏఐ ప్రో","అల్ట్రా ప్లాన్" సబ్‌స్క్రిప్షన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
వివరాలు
జీమెయిల్‌లో "పర్సనలైజ్డ్ స్మార్ట్ రిప్లై"
ప్రస్తుతానికి ఇది ఇంగ్లిష్, స్పానిష్ భాషల మధ్య మాత్రమే అనువాదాన్ని అందిస్తోంది. త్వరలోనే మరిన్ని భాషలకూ ఈ సదుపాయాన్ని విస్తరించనున్నట్లు గూగుల్ ప్రకటించింది.
అదే సమయంలో, ఈ ఫీచర్‌ను గూగుల్ వర్క్‌స్పేస్ బిజినెస్ కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఎంటర్‌ప్రైజ్ వెర్షన్‌లో పరీక్షిస్తున్నట్లు తెలిపింది.
ఈ ఏడాది చివరినాటికి కొన్ని ఎంపిక చేసిన సంస్థలతో ప్రయోగాత్మకంగా ఈ ఫీచర్‌ను అందించేందుకు ప్రయత్నాలు జరుపుతోంది.
ఇంకా, గూగుల్ I/O 2025లో మరో కీలక అంశంగా, జీమెయిల్‌లో "పర్సనలైజ్డ్ స్మార్ట్ రిప్లై" సదుపాయాన్ని కూడా పరిచయం చేసింది.
ఇది వినియోగదారుడి వ్యక్తిగత శైలిని గుర్తించి, తగిన ప్రతిస్పందనలు సజావుగా ఇవ్వగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.