Google: ఏఐతో నకిలీ ఉద్యోగ ప్రకటనలు.. గూగుల్ కీలక హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ దూసుకుపోతున్న వేగానికి అనుగుణంగా సైబర్ మోసగాళ్లు కూడా తమ పద్ధతులను మరింత ఆధునికంగా మార్చుకుంటున్నారు. ఈ తరుణంలో గూగుల్ తాజా హెచ్చరిక విడుదల చేసింది. జెనరేటివ్ ఏఐ సాయంతో నకిలీ ఉద్యోగ ప్రకటనలు, నకిలీ వ్యాపార వెబ్‌సైట్లు, యాప్‌లు వేగంగా పెరుగుతున్నాయని గూగుల్ స్పష్టం చేసింది. ప్రత్యేకంగా పండుగ సీజన్ షాపింగ్ కాలం మరియు సంవత్సరాంత ఉద్యోగాల కోసం శోధించే సమయంలో ఇలాంటి మోసాలు గణనీయంగా పెరుగుతున్నాయని తెలిపింది.
వివరాలు
'ఇంటర్వ్యూ సాఫ్ట్‌వేర్' పేరుతో మోసపూరిత ఫైళ్లు
గూగుల్ ట్రస్ట్ & సేఫ్టీ బృందం చెప్పిన వివరాల ప్రకారం, దొంగలు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అసలు కంపెనీల బ్రాండింగ్‌ను నకిలీగా తీర్చిదిద్ది ఉద్యోగ ప్రకటనలు, యాప్‌లు, వెబ్‌సైట్లు తయారుచేస్తున్నారు. ఇవి అసలు ప్రకటనల్లా కనిపించడంతో ఉద్యోగార్థులు, చిన్న వ్యాపారులు సులభంగా నమ్మిపోతున్నారని పేర్కొంది. అసలు కంపెనీ పేర్లను వాడుతూ నకిలీ రిక్రూటర్లు వ్యక్తిగత సమాచారం సేకరించడం, ప్రాసెసింగ్ ఫీజు పేరుతో డబ్బులు లాగడం వంటి ఘటనలు పెరుగుతున్నాయని తెలిపింది. కొందరు అయితే 'ఇంటర్వ్యూ సాఫ్ట్‌వేర్' పేరుతో మోసపూరిత ఫైళ్లను పంపించి, వ్యక్తిగత డేటాను దోచుకుంటున్నారని హెచ్చరించింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే, నిజమైన కంపెనీలు ఉద్యోగ నియామక ప్రక్రియలో ఎటువంటి రూపంలోనూ డబ్బులు లేదా బ్యాంక్ వివరాలు అడగవని గూగుల్ స్పష్టం చేసింది.
వివరాలు
వ్యాపారులూ బహు పరాక్
వ్యాపార సంస్థలను కూడా లక్ష్యంగా చేసుకుని 'రివ్యూ ఎక్స్‌టార్షన్' పేరుతో మరో రకం మోసం జరుగుతోందని గూగుల్ వెల్లడించింది. మోసగాళ్లు కొన్ని వ్యాపార పేజీలపై పెద్ద సంఖ్యలో ఒక స్టారుతో నెగెటివ్ రివ్యూలు పోస్ట్ చేసి, వాటి ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారు. ఆ రివ్యూలను తొలగించాలంటే డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ సమస్యను నేరుగా బిజినెస్ ప్రొఫైల్ నుంచే రిపోర్ట్ చేయడానికి ఇప్పటి నుంచి సౌకర్యం అందుబాటులో ఉందని గూగుల్ తెలిపింది.
వివరాలు
జీమెయిల్, గూగుల్ మెసేజ్‌ల్లో రియల్‌టైమ్ స్కాం డిటెక్షన్ ఫీచర్లు
అలాగే, ఏఐ పేరిట నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్లు తయారు చేసి 'ఫ్రీ యాక్సెస్' లేదా 'ఎక్స్‌క్లూజివ్ వెర్షన్' అంటూ వినియోగదారులను ఆకర్షించడం, మోసపూరిత సాఫ్ట్‌వేర్‌ని డౌన్‌లోడ్ చేయించడం, ఖాతా వివరాలు దొంగిలించడం వంటి ఘటనలు నమోదవుతున్నాయని పేర్కొంది. కొన్ని వీపీఎన్ యాప్‌లలో మాల్వేర్ దాగి ఉండే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఇలాంటి మోసాలను ఆపేందుకు గూగుల్ సేఫ్ బ్రౌజింగ్‌లో ఏఐ ఆధారిత భద్రతా రక్షణలు, ప్లే స్టోర్‌లో కఠినమైన తనిఖీలు అమలు చేస్తోందని తెలిపింది. అలాగే జీమెయిల్, గూగుల్ మెసేజ్‌ల్లో రియల్‌టైమ్ స్కాం డిటెక్షన్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయని వివరించింది.