Page Loader
Google AI Pro: ₹19,500 విలువైన గూగుల్ AI ప్రో ప్లాన్ ఇప్పుడు భారతీయ విద్యార్థులకు ఉచితం
₹19,500 విలువైన గూగుల్ AI ప్రో ప్లాన్ ఇప్పుడు భారతీయ విద్యార్థులకు ఉచితం

Google AI Pro: ₹19,500 విలువైన గూగుల్ AI ప్రో ప్లాన్ ఇప్పుడు భారతీయ విద్యార్థులకు ఉచితం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 16, 2025
02:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ విద్యార్థులకు గూగుల్‌ శుభవార్త అందించింది. గూగుల్‌ సంస్థ తమ అడ్వాన్స్‌డ్‌ ఏఐ టూల్స్‌ను భారతదేశానికి చెందిన విద్యార్థులకు పూర్తిగా ఒక సంవత్సరపు కాలానికి ఉచితంగా ఉపయోగించే అవకాశాన్ని కల్పించింది. 'జెమినీ ఫర్‌ స్టూడెంట్స్‌' అనే పేరుతో ఈ ప్రత్యేక ఆఫర్‌ను గూగుల్‌ ప్రవేశపెట్టింది. 18 సంవత్సరాల వయస్సు కలిగిన విద్యార్థులు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు ఈ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ కాలపరిమితిలో విద్యార్థులకు అదనంగా 2 టీబీ క్లౌడ్‌ స్టోరేజ్‌ కూడా ఉచితంగా లభించనుంది.

వివరాలు 

సెప్టెంబర్‌ 15ను ఈ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ

జెమినీ టూల్స్‌ను ఉపయోగించాలనుకునే విద్యార్థులు గూగుల్‌ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్‌ పేజీ ద్వారా తమ వివరాలతో ముందుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. గూగుల్‌ సంస్థ సెప్టెంబర్‌ 15ను ఈ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీగా నిర్ణయించింది. ఒక్కసారి రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత గూగుల్‌ ఆధారిత శక్తివంతమైన ఏఐ మోడల్‌ అయిన జెమినీ 2.5 ప్రోను విద్యార్థులు వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా చదువుకోడానికి, రైటింగ్‌, రీసెర్చ్‌ పనులకు, ఉద్యోగ సంబంధిత అవసరాలకు ఉపయోగపడే టూల్స్‌ను అందిస్తున్నారు.

వివరాలు 

నోట్‌బుక్‌ఎల్‌ఎం అనే ప్రత్యేక టూల్‌ ద్వారా స్టడీ నోట్స్‌

ఈ ప్లాన్‌ ద్వారా పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు, హోంవర్క్‌లు చేయడంలో, వ్యాసరచన, కోడింగ్‌ సంబంధిత పనుల్లో, ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అనేక రకాల అకడమిక్‌ సపోర్ట్‌ అందుతుంది. నోట్‌బుక్‌ఎల్‌ఎం అనే ప్రత్యేక టూల్‌ ద్వారా స్టడీ నోట్స్‌ను తయారు చేసుకునే అవకాశం ఉంది. జెమినీ లైవ్‌ టూల్‌ ఉపయోగించి విద్యార్థులు రియల్-టైమ్‌లో చాటింగ్‌ ద్వారా సమాచారం పొందవచ్చు. ప్రజెంటేషన్లు, ప్రాజెక్ట్‌లు రూపొందించడంలో విద్యార్థులకు ఉపయోగపడే గూగుల్‌ ఏఐ ఆధారిత వీడియో క్రియేటర్‌ టూల్‌ అయిన 'వియో3'ను కూడా ఈ ఉచిత ప్లాన్‌లో వినియోగించుకోవచ్చు. డీప్‌ రీసెర్చ్‌ టూల్‌ ద్వారా కావాల్సిన అంశాలపై లోతుగా సమాచారాన్ని సేకరించవచ్చు. సాధారణంగా ఈ జెమినీ అడ్వాన్స్‌డ్‌ ప్లాన్‌ ధర రూ.19,500 కాగా, విద్యార్థులకు ఉచితంగా అందించనుంది.

వివరాలు 

విద్య, ఉద్యోగ రంగాల్లో కృత్రిమ మేధస్సు ప్రభావం

విద్యార్థులు చదువుల కోసం, తమ భవిష్యత్‌ ప్రణాళికల్లో ఏఐ టూల్స్‌ వినియోగాన్ని పెంచుకుంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్‌ తెలిపింది. విద్య, ఉద్యోగ రంగాల్లో కృత్రిమ మేధస్సు ప్రభావం పెరుగుతుండటంతో టెక్నాలజీ కంపెనీలు తమ సేవలతో విద్యార్థులకు మద్దతు ఇవ్వాలని యత్నిస్తున్నాయని గూగుల్‌ స్పష్టం చేసింది. ఈ ఉచిత ఆఫర్‌ను ఎంత మంది విద్యార్థులు వినియోగించుకోవచ్చన్న దానిపై గూగుల్‌ ఎలాంటి పరిమితులు విధించలేదు. అసైన్‌మెంట్లు తయారు చేయడంలో, రెజ్యూమే సిద్ధం చేసుకోవడంలో విద్యార్థులకు గూగుల్‌ డిజిటల్‌ సహాయకుడిగా నిలుస్తుందని సంస్థ వెల్లడించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

గూగుల్ ఇండియా చేసిన ట్వీట్