
Google's Pixel 10 Pro Fold: టెస్టింగ్ సమయంలో పేలిపోయిన గూగుల్ పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తాజాగా విడుదల చేసిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్' డ్యూరాబిలిటీ టెస్ట్‌లో ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ప్రముఖ యూట్యూబర్ జాక్ నెల్సన్ (JerryRigEverything) తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఫోన్‌పై కఠినమైన టెస్టులు నిర్వహించగా, చివరికి ఆ ఫోన్ కెమెరా ముందే పేలిపోయింది. తన దశాబ్ద కాలం ఫోన్ టెస్టింగ్ కెరీర్‌లో ఈ రకం ఘటన మొదటిసారి జరిగిందని నెల్సన్ తెలిపారు.
టెస్ట్ ఫలితాలు
మోహ్స్ స్కేల్‌పై లెవల్ 6 వద్ద గీతలు
టెస్టింగ్ సమయంలో నెల్సన్ మొదటగా పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ కవర్ స్క్రీన్‌ను పరిశీలించారు. అది మోహ్స్ హార్డ్‌నెస్ స్కేల్‌లో లెవల్ 6 వద్ద గీతలు పడగా, లెవల్ 7లో ఇంకా లోతైన గీతలు వచ్చాయి. అంతర్గత ఫ్లెక్సిబుల్ ప్లాస్టిక్ స్క్రీన్ కేవలం గోరు తాకినప్పటికీ గీతలు పడినట్టు తేలింది. అయితే, ఫోన్‌ను మడిచినప్పుడు ఆ లోపలి స్క్రీన్ కొంతవరకు రక్షితంగా ఉంటుంది. ఫోన్ బయట అంచులు మాత్రం గీతలు పడడంతో, వాటి పైపూత ఊడి అసలు రంగు బయటకు వచ్చింది.
నిరోధక పరీక్షలు
మట్టికణాల పరీక్షలో విఫలమైన హింజ్
ధూళి, నీటి నిరోధకతకు IP68 రేటింగ్ ఉన్నప్పటికీ, ఫోన్ హింజ్ మట్టికణాల పరీక్షలో విఫలమైంది. నెల్సన్ చేసిన టెస్ట్‌లో హింజ్‌లో మట్టికణాలు ఇరుక్కున్నాయి. అలాగే ఫోన్ బెండ్ టెస్టులో కూడా విఫలమై, హింజ్ వద్ద కాకుండా ఎడమ వైపున ఉన్న యాంటెన్నా లైన్స్ వెంట విరిగిపోయింది. ఇది గూగుల్ డిజైన్‌లో ఇంకా మార్పులు చేయలేదని నెల్సన్ తీవ్రంగా విమర్శించారు.
బ్యాటరీ వైఫల్యం
టెస్టింగ్ సమయంలో పేలిన మొట్టమొదటి ఫోన్
ఫోన్ విరిగిపోయిన తర్వాత, నెల్సన్ దాన్ని మరింత వంచడానికి ప్రయత్నించగా అకస్మాత్తుగా పొగ ఎగసి ఫోన్ పేలిపోయింది. "బ్యాటరీ ఇక భరించలేదనిపించింది. నేను ఇంతకాలం చేసిన టెస్టుల్లో ఫోన్ పేలిపోవడం ఇదే మొదటిసారి," అని నెల్సన్ వీడియోలో తెలిపారు. ఈ ఘటనతో పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్, నెల్సన్ నిర్వహించిన టెస్టుల్లో పొగ ఎగిసిన తొలి స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు అయ్యింది.
కంపెనీ ప్రతిస్పందన
ఇంకా స్పందించని గూగుల్
ఈ ఘటనపై గూగుల్ ఇప్పటివరకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అయితే, గూగుల్ ఫోన్లలో బ్యాటరీ సమస్యలు కొత్తవి కావు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే పిక్సెల్ 6A, పిక్సెల్ 4A ఫోన్లకు బ్యాటరీ వేడెక్కే ప్రమాదాన్ని తగ్గించేందుకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ఇచ్చింది. "బ్యాటరీ పేలుడు ఎంత డ్రామాటిక్‌గా ఉన్నా, ఇది పిక్సెల్ 10 ప్రో ఫోల్డ్ డిజైన్‌లో లోపం ఉందని చెప్పలేం," అని iFixit సంస్థకు చెందిన ఎలిజబెత్ చాంబర్‌లైన్ వ్యాఖ్యానించారు.