Page Loader
Apple devices: ఆపిల్ యూజర్లకు కేంద్రం 'హై రిస్క్‌' అలర్ట్‌
ఆపిల్ యూజర్లకు కేంద్రం 'హై రిస్క్‌' అలర్ట్‌

Apple devices: ఆపిల్ యూజర్లకు కేంద్రం 'హై రిస్క్‌' అలర్ట్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2024
02:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ (Apple) కంపెనీకి చెందిన ఐఫోన్స్‌, మ్యాక్స్‌, ఆపిల్ వాచీలు వాడుతున్నవారికి కేంద్రం అప్రమత్తతను ప్రకటించింది. పాత సాఫ్ట్‌వేర్‌ వాడుతున్న ఈ డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని గుర్తించిన కేంద్రం, ఎలక్ట్రానిక్స్‌ & ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలోని కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) ద్వారా ఓ అలర్ట్‌ జారీ చేసింది. ఈ డివైజులు వాడుతున్న వారికి 'హైరిస్క్‌' ప్రమాదం ఉందని హెచ్చరించింది. పాత సాఫ్ట్‌వేర్‌ వాడే డివైజుల్లో సెక్యూరిటీ లోపాలు ఉండటంతో, ఆపిల్ పరికరాలలో అవాంఛనీయులు అక్రమంగా ప్రవేశించి సెన్సిటివ్‌ డేటా యాక్సెస్‌ చేయడం లేదా దానిని మానిప్యులేట్‌ చేయడం వంటి ప్రమాదాలు ఉన్నాయని CERT-In పేర్కొంది.

వివరాలు 

డివైజ్‌లను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచన

ఐఓస్‌ 18.1 కంటే ముందు వెర్షన్లు లేదా 17.7.1 కలిగిన ఐఫోన్లు, ఐప్యాడ్‌ఓఎస్‌ 18.1 కంటే ముందు లేదా 17.7.1 వెర్షన్‌ కలిగిన ఐప్యాడ్‌లు, పాత మ్యాక్‌ఓఎస్‌ వాడే మ్యాక్‌లు, వాచ్‌ ఓఎస్‌ 11 కంటే ముందు వెర్షన్‌ కలిగిన యాపిల్‌ వాచ్‌లు ఈ రిస్కు గురవుతాయని చెప్పింది. అలాగే, పాత టీవీవోఎస్‌, విజన్‌ఓఎస్‌,సపారీ బ్రౌజర్లకు కూడా ఇదే రకమైన ముప్పు ఉందని CERT-In తెలిపింది. అయితే, ఈ సెక్యూరిటీ లోపాలను యాపిల్‌ ముందే గుర్తించి, కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ ద్వారా పరిష్కారం చూపిందని, పాత సాఫ్ట్‌వేర్‌ వెర్షన్లు వాడే వారిని వెంటనే తమ పరికరాలను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. అప్పుడు మాత్రమే సైబర్‌ ప్రమాదాల నుండి రక్షణ పొందగలరని CERT-In పేర్కొంది.