Mobile users ID: మొబైల్ వినియోగదారులకు ప్రత్యేక ఐడీ ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం
భారత ప్రభుత్వం త్వరలో మొబైల్ వినియోగదారులకు ప్రత్యేక ఐడీ నంబర్‌ను అందించనుంది. ఈ ఐడీ నంబర్ మొబైల్, సిమ్‌కు సంబంధించిన ప్రతి సమాచారాన్ని కలిగి ఉండే గుర్తింపు కార్డ్ లాగా పని చేస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) ఈ ఐడీ నంబర్ల కేటాయింపు పనిలో నిమగ్నమైంది. ఈ ఐడీ నంబర్ ద్వారా మీరు ఎన్ని ఫోన్లు ఉపయోగిస్తున్నారు? మీ వద్ద ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉన్నాయి? ఏ సిమ్ ఎక్కడ యాక్టివ్‌గా ఉంది? అలాగే మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డ్‌లు జారీ చేయబడ్డాయి? అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఈ ఐడీ నంబర్ సహాయంతో ప్రభుత్వం మీ మొబైల్‌కు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఒకే చోట ఉంచాలని చూస్తోంది.
సైబర్ నేరాలను నియంత్రణ, నకిలీ సిమ్ కార్డుల బ్లాక్
సైబర్ సెక్యూరిటీని మెరుగుపరచడంతో పాటు ట్రాకింగ్ సిస్టమ్ ప్రభావవంతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రత్యేకమైన మొబైల్ ఐడీని ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఐడీ నంబర్ సహాయంతో ప్రభుత్వం నకిలీ సిమ్ కార్డులు, అధికంగా కేటాయించిన సిమ్ కార్డులను రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం, టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్ వివిధ లైసెన్స్‌డ్ సర్వీస్ ఏరియాలలో (LSAs) AI-ఆధారిత ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించి ఆడిట్‌ను నిర్వహిస్తుంది. తర్వాత పరిమితికి మించిన సిమ్ కార్డులను బ్లాక్ చేయనుంది. మీరు కొత్త కనెక్షన్ కోసం దరఖాస్తు చేసినప్పుడు ఈ ప్రత్యేక ఐడీ మీకు ప్రభుత్వం ద్వారా అందించబడుతుంది. దీనితో పాటు, కొత్త సిమ్ కార్డ్ కొనుగోలు చేసేటప్పుడు, దానిని ఎవరు ఉపయోగిస్తారో కూడా చెప్పాల్సి ఉంటుంది.