LOADING...
Grok: గ్రోక్ సేవలు నిలిచిపోయాయా..? యాప్‌, వెబ్‌, లాగిన్‌లో ఇబ్బందులు
గ్రోక్ సేవలు నిలిచిపోయాయా..? యాప్‌, వెబ్‌, లాగిన్‌లో ఇబ్బందులు

Grok: గ్రోక్ సేవలు నిలిచిపోయాయా..? యాప్‌, వెబ్‌, లాగిన్‌లో ఇబ్బందులు

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
09:48 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్‌కు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ గ్రోక్‌ మరోసారి సాంకేతిక సమస్యలతో వార్తల్లో నిలిచింది. ప్రపంచంలోని పలుచోట్ల వినియోగదారులు గ్రోక్‌ సేవలు సరిగా పనిచేయడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు. యాప్‌ ఓపెన్ కాకపోవడం, ప్రశ్నలకు సమాధానాలు రాకపోవడం, లాగిన్ సమస్యలు ఎదురవుతున్నట్లు చెబుతున్నారు. అవుటేజ్‌లను ట్రాక్ చేసే డౌన్‌డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. ఎక్కువ సమస్యలు మొబైల్ యాప్‌ల్లోనే నమోదయ్యాయి. మొత్తం ఫిర్యాదుల్లో 71 శాతం యాప్‌లకు సంబంధించినవే కాగా, 28 శాతం వెబ్‌సైట్‌ వినియోగంలో ఇబ్బందులు ఎదురైనట్లు తెలిపింది. మరో 1 శాతం మంది లాగిన్ సమస్యలను ఎదుర్కొన్నారు.

వివరాలు 

ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌తో పాటు ప్రత్యేక గ్రోక్‌ యాప్‌లో కూడా ఇదే పరిస్థితి

చాలామంది వినియోగదారులు గ్రోక్‌ ప్రశ్నలకు ఖాళీ సమాధానాలు ఇస్తోందని, ప్రాంప్ట్‌లను ప్రాసెస్ చేయడం లేదని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో "హై డిమాండ్" సందేశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌తో పాటు ప్రత్యేక గ్రోక్‌ యాప్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొందరు షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లలో చాట్‌బాట్‌ స్పందించకపోవడం కనిపించింది. 2023లో xAI సంస్థ అభివృద్ధి చేసిన గ్రోక్‌ను ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో అనుసంధానం చేశారు. అప్పటి నుంచి ఇది చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఏఐ చాట్‌బాట్‌లకు పోటీగా నిలుస్తోంది. అయితే గత కొన్ని నెలలుగా గ్రోక్‌లో వరుసగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి.

వివరాలు 

అధికారిక ప్రకటన విడుదల చేయని xAI

స్పందనలు ఆలస్యం కావడం, లాగిన్‌ విఫలం కావడం, ట్రాఫిక్‌ ఎక్కువగా ఉన్న సమయంలో "హై డిమాండ్" నోటిఫికేషన్లు రావడం వంటి సమస్యలు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. ఇక రెడిట్‌లో కొందరు యూజర్లు తమ పాత చాట్‌లు కనిపించడం లేదని చెబుతున్నారు. మరికొందరు గ్రోక్‌లోని "ఇమాజిన్" ఫీచర్ పనిచేయడం లేదని, కొత్త చాట్‌లకు ఫైల్ అప్‌లోడ్ సదుపాయం ఆగిపోయిందని పేర్కొన్నారు. ఈ అంతరాయం సిస్టమ్ మార్పులు, సర్వర్ రోల్‌బ్యాక్‌ లేదా xAI పెద్ద అప్‌డేట్‌ కారణంగా వచ్చి ఉండొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సమస్యలపై ఇప్పటివరకు xAI అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

Advertisement