Loading...
Himalayan Sediments: అండమాన్‌ సముద్ర గర్భంలో హిమాలయ మట్టి.. ఎన్‌జీఆర్‌ఐ అధ్యయనంలో కీలక విషయాలు
ఎన్‌జీఆర్‌ఐ అధ్యయనంలో కీలక విషయాలు

Himalayan Sediments: అండమాన్‌ సముద్ర గర్భంలో హిమాలయ మట్టి.. ఎన్‌జీఆర్‌ఐ అధ్యయనంలో కీలక విషయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 02, 2026
11:18 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలోని అండమాన్‌ దీవులకు సమీపంలో సముద్ర గర్భంలో పేరుకుపోతున్న ఒండ్రు మట్టి ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంపై ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన మట్టే అండమాన్‌ సముద్ర గర్భంలో చేరుతోందని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. గోవాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐవో) సహకారంతో ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. అండమాన్‌ దీవుల పరిసరాల్లోని తొమ్మిది ప్రాంతాల నుంచి సముద్ర ఉపరితల మట్టి నమూనాలను సేకరించి,వాటిలోని రసాయన,ఖనిజ లక్షణాలను విశ్లేషించారు.

వివరాలు 

మట్టిలో ఇల్లెట్‌ ఖనిజం అధికంగా..

ఈ పరీక్షల్లో అండమాన్‌ సముద్ర గర్భంలో లభించిన ఒండ్రు మట్టిలో గంగా-బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ ద్వారా తరలివచ్చిన హిమాలయ ప్రాంతపు అవశేషాలే అధికంగా ఉన్నట్లు గుర్తించారు.

పరిశోధకులు సేకరించిన బంకమన్నులో ఇల్లెట్‌ ఖనిజం 37 నుంచి 62 శాతం వరకు ఉన్నట్లు గుర్తించారు.

అలాగే కెమికల్‌ ఇండెక్స్‌ ఆఫ్‌ ఆల్టరేషన్‌ (సీఐఏ) విలువలు 46.7 నుంచి 55.8 మధ్య నమోదయ్యాయి.

ఈ రెండు లక్షణాలు హిమాలయ ప్రాంతాల్లో కనిపించే మట్టి లక్షణాలతో సరిపోలుతున్నాయని పరిశోధకులు వెల్లడించారు.

దీంతో అండమాన్‌ సముద్ర గర్భంలో పేరుకుపోతున్న అవక్షేపాలకు హిమాలయ ప్రాంతంతో ఉన్న సంబంధం స్పష్టమైనట్లు పేర్కొన్నారు.

వివరాలు 

ఏటా వెయ్యి మిలియన్‌ టన్నుల మట్టి రవాణా

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్త పవన్‌ మిరియాల ఈ ప్రక్రియపై వివరాలు వెల్లడించారు.

అండమాన్‌ సముద్ర గర్భ లోయ ప్రాంతంలో భారత్‌ ప్లేట్‌ భౌగోళికంగా లోపలికి కుంగిపోతుండటంతో, నదుల ద్వారా కొట్టుకొచ్చే మట్టి క్రమంగా అక్కడ పేరుకుపోతోందని తెలిపారు.

గంగా, బ్రహ్మపుత్ర నదులు హిమాలయ ప్రాంతాల నుంచి భారీ మొత్తంలో మట్టి, అవక్షేపాలను తీసుకొచ్చి బంగాళాఖాతంలో కలుపుతున్నాయని చెప్పారు.

ఈ రెండు నదీ వ్యవస్థలు ఏటా దాదాపు వెయ్యి మిలియన్‌ టన్నుల మట్టిని బంగాళాఖాతంలోకి చేరవేస్తున్నాయని పవన్‌ మిరియాల పేర్కొన్నారు.

ఈ అవక్షేపాల్లో కొంత భాగం సముద్ర ప్రవాహాలు, భౌగోళిక ప్రక్రియల ద్వారా అండమాన్‌ ప్రాంత సముద్ర గర్భంలోకి చేరి అక్కడ స్థిరపడుతున్నట్లు అధ్యయనం సూచిస్తోంది.

ADVERTISEMENT