Digital Payments : ఆరేళ్లలో డిజిటల్ పేమెంట్స్ రెట్టింపు..కెర్నీ అండ్ అమెజాన్ సంయుక్త సర్వే
రోజురోజుకు డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నాయి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి భారత్‌లో డిజిటల్ చెల్లింపులు 7 లక్షల కోట్ల డాలర్లకు చేరనున్నాయని కెర్నీ అండ్ అమెజాన్ సంయుక్త సర్వేలో తేలింది. 'హౌ అర్బన్ ఇండియా పేస్' అనే పేరుతో కెర్నీ, అమెజాన్ పే సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఆఫ్‌లైన్ చెల్లింపులు గణనీయంగానే ఉన్నా, ఆన్‌లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులే ఎక్కువగా జరుగుతున్నాయని, పేమెంట్స్ విషయమై కస్టమర్ల ధోరణి శాశ్వతంగా షిఫ్ట్ అవుతున్నదని ఈ అధ్యయనం సారాంశం
90 శాతం మంది ఆన్ లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులే
సర్వేలో పాల్గొన్న వారిలో 90 శాతం మంది ఆన్ లైన్ కొనుగోళ్లకు డిజిటల్ చెల్లింపులకే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సంపన్నులే ఎక్కువగా డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు. వారు వివిధ రూపాల్లో డిజిటల్ పేమెంట్స్ 80 శాతం చేస్తారని ఈ అధ్యయనం సారాంశం. దేశంలోని 120 నగరాల పరిధిలో 1000 మంది వ్యాపారులతోపాటు ఆరు వేల మందిని సర్వే చేశామని కెర్నీ, అమెజాన్ పే తెలిపాయి. చిన్న పట్టణాల పరిధిలో డిజిటల్ జోరు చిన్న పట్టణాల పరిధిలో 65 శాతం డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో 75 శాతం డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని కెర్నీ-అమెజాన్ పే సంయుక్త సర్వే పేర్కొంది.
ఏటా గణనీయంగా డిజిటల్ చెల్లింపుల పెరుగుదల
2017-18 ఆర్థిక సంవత్సరంలో 300 బిలియన్ డాలర్ల విలువైన పేమెంట్స్ జరిగితే, 2023-24 నాటికి 3.6 లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఏడు లక్షల కోట్ల డాలర్లకు చేరుతుందని ఆ నివేదిక సారాంశం. కార్డులు, డిజిటల్ వాలెట్లతో డిజిటల్ చెల్లింపుల్లో పాపులారిటీ పెరిగిందని, మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో వీటి వాటా 10 శాతం ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. 25- 43 మధ్య వున్న వారీతో సహా 44-60 వయసు వున్న వారు అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారు. స్త్రీ పురుషులు 72 శాతం డిజిటల్ చెల్లింపులు జరుపుతున్నారని పేర్కొంది.