Truecaller : ట్రూకాలర్‌లో వెరిఫైడ్ ప్రభుత్వ అధికారులు, సర్వీసుల నెంబర్లను ఎలా చుడచ్చో తెలుసా?
ప్రభుత్వ సేవల కోసం అధీకృత నంబర్‌లను యాక్సెస్ చేయడానికి ట్రూకాలర్( Truecaller) మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ ఫీచర్‌లో భాగంగా ట్రూకాలర్, ధృవీకరించిన ప్రభుత్వ అధికారులు లేదా సేవల నంబర్లను డిజిటల్ డైరెక్టరీగా యాప్‌లో యాడ్ చేసింది. ఈ డైరెక్టరీని ప్రభుత్వం,అధికారిక వర్గాల నుంచి అందుకున్న సమాచారం ఆధారంగా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. సాధారణంగా, గుర్తు తెలియని నంబర్‌లను గుర్తించడానికి చాలా మంది ట్రూకాలర్‌ను ఉపయోగిస్తారు. ఈ కొత్త ఫీచర్‌తో,ఫోన్ కాల్స్ స్పామ్ అవునో కాదో తెలుసుకోవడం సులభమవుతుంది. అలాగే, ట్రూకాలర్ యాప్ ధృవీకరించిన ప్రభుత్వ అకౌంట్లను గ్రీన్ బ్యాక్‌గ్రౌండ్, బ్లూ టిక్ ద్వారా చూపిస్తుంది, ఇది ఆ నంబర్ వెరిఫైడ్ అని స్పష్టంగా తెలియజేస్తుంది.
కొత్త ఫీచర్ స్కామర్ల నుండి వినియోగదారుల డేటాను, డబ్బును కాపాడుతుంది
ఇది స్పామ్ కాల్ కాదని వినియోగదారులకు సంకేతం ఇస్తుంది. ఈ విధంగా, ట్రూకాలర్ కొత్త ఫీచర్ స్పామ్ మోసాలను తగ్గించడంలో, వినియోగదారులను రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. స్కామర్లు ప్రభుత్వ అధికారుల పేరుతో కాల్స్ చేసి వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నిస్తారు. ట్రూకాలర్ కొత్త ఫీచర్ అలాంటి స్కామర్ల నుండి వినియోగదారుల డేటాను, డబ్బును కాపాడుతుంది. అంతేకాకుండా, ఈ ఫీచర్ ద్వారా ప్రభుత్వ ప్రతినిధులు పబ్లిక్ యాక్సెస్‌ను మరింత క్రమబద్ధీకరించవచ్చు. ఇప్పటికే, ట్రూకాలర్ 240 మిలియన్లకు పైగా భారతీయ వినియోగదారులను ప్రభుత్వం ద్వారా కనెక్ట్ చేసే లక్ష్యంతో పనిచేస్తోంది.
అధీకృత నంబర్లను ఎలా చెక్ చేయాలి?
ఈ ఫీచర్ 20 కేంద్ర మంత్రిత్వ శాఖలు, 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అందుబాటులో ఉంది. ట్రూకాలర్ యాప్‌లో అధీకృత ప్రభుత్వ నంబర్లను గుర్తించడానికి, వినియోగదారులు ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేసి, "Government Services" ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ వివిధ కేటగిరీలు కనిపిస్తాయి, వాటిలో మీకు అవసరమైన సేవను సెర్చ్ చేయవచ్చు. అదనంగా, ట్రూకాలర్ యాప్ మీ రాష్ట్రాన్ని ఎంచుకునే ఆప్షన్‌ను కూడా అందిస్తుంది. "Quick Dial" సెక్షన్ ద్వారా ముఖ్యమైన ప్రభుత్వ నంబర్లు అందుబాటులో ఉంటాయి. సెర్చ్ బార్ ఉపయోగించి ప్రత్యేకమైన నంబర్‌ను ఈజీగా వెతుక్కోవచ్చు. వినియోగదారుల భద్రతను మరింత మెరుగుపరచడానికి ట్రూకాలర్ తీసుకొచ్చిన ఈ సదుపాయం ఎంతో ఉపయుక్తమని చెప్పవచ్చు.