Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్: మీ ఫోటోలతో 'మెటా AI' గేమ్స్.. ఈ AI ఫీచర్ ఎలా ఆఫ్ చేయాలంటే ?
ఈ వార్తాకథనం ఏంటి
ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించే వారికి సైబర్ భద్రత నిపుణులు కీలక హెచ్చరిక చేస్తున్నారు. మెటా సంస్థ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 'మ్యూజ్ ఇమేజ్' (Muse Image) అనే AI ఆధారిత ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్‌పై ప్రపంచవ్యాప్తంగా గోప్యతకు సంబంధించిన ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పబ్లిక్ అకౌంట్లు కలిగిన వినియోగదారులు తమ ప్రైవసీ సెట్టింగ్‌లను ఒకసారి పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
వివరాలు
అసలు వివాదం ఏంటి?
ఈ AI ఫీచర్ ద్వారా ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్ యూజర్‌నేమ్‌ను ప్రాంప్ట్‌గా ఉపయోగించి, ఆ వ్యక్తి ముఖాన్ని పోలిన కొత్త AI చిత్రాలను రూపొందించే అవకాశం ఉందని సమాచారం. దీంతో సంబంధిత వ్యక్తి ప్రత్యక్ష అనుమతి లేకుండానే అతని లేదా ఆమె రూపాన్ని పోలిన చిత్రాలు సృష్టించే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ఈ ఫీచర్‌ను ఉపయోగించే విషయంలో యూజర్ల నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకోకుండా, పబ్లిక్ అకౌంట్లకు డిఫాల్ట్‌గా అందుబాటులో ఉంచినట్లు విమర్శలు వస్తున్నాయి.
వివరాలు
యూజర్లు, గోప్యతా నిపుణుల ఆందోళన
ఈ ఫీచర్‌పై టెక్నాలజీ నిపుణులు, గోప్యత పరిరక్షణ కోసం పనిచేసే పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారులు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలను ఇప్పుడు AI అవసరాల కోసం ఉపయోగించడం సరైన విధానం కాదని వారు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అయితే Facebook, Instagram, WhatsApp వంటి మెటా ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని తగ్గించాలని లేదా పూర్తిగా నిలిపివేయాలని సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
వివరాలు
సెట్టింగ్ మళ్లీ ఆన్ అవుతోందా?
ఈ ఫీచర్‌ను సెట్టింగ్స్‌లోకి వెళ్లి మాన్యువల్‌గా ఆఫ్ చేసిన తర్వాత కూడా, కొంతసేపటికి ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే మళ్లీ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతోందని పలువురు యూజర్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో స్క్రీన్ రికార్డింగ్‌లతో సహా పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ అకౌంట్‌ను ప్రైవేట్ అకౌంట్‌గా మార్చుకోవడమే ప్రస్తుతం మరింత సురక్షితమైన మార్గమని పలువురు సైబర్ భద్రత నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
మెటా వివరణ ఇదే
ఈ AI టూల్‌కు తగిన భద్రతా చర్యలు అమలు చేసినట్లు మెటా తెలిపింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వినియోగదారులు, అలాగే ప్రైవేట్ అకౌంట్లు కలిగిన వారికి ఈ ఫీచర్ వర్తించదని స్పష్టం చేసింది. కేవలం పబ్లిక్ అకౌంట్లలోని సమాచారాన్ని మాత్రమే ఉపయోగిస్తుందని పేర్కొంది. ఎవరైనా ఈ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి అభ్యంతరకరమైన AI చిత్రాలను రూపొందిస్తే, సంబంధిత చిత్రంపై లాంగ్ ప్రెస్ చేసి 'Thumbs Down' ఎంపిక ద్వారా రిపోర్ట్ చేసే అవకాశం కూడా కల్పించినట్లు మెటా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికాతో పాటు కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. భవిష్యత్తులో దీనిని ఫేస్‌బుక్‌లో కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
వివరాలు
ఈ ఫీచర్‌ను ఎలా పరిమితం చేయాలి?
మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో పబ్లిక్ అకౌంట్ ఉపయోగిస్తుంటే ఈచర్యలు తీసుకోవడం మంచిది. ముందుగా Instagram Profile Settings ఓపెన్ చేయండి. అక్కడ Sharing and Reuse Controls విభాగంలోకి వెళ్లండి. మెటా AI ఫీచర్ల కోసం ఇతరులు మీ కంటెంట్‌ను ఉపయోగించుకునే ఆప్షన్‌ను Disable చేయండి. అదనపు భద్రత కోసం మీ అకౌంట్‌ను Privateగా మార్చుకోవడం ఉత్తమం. అలాగే ఈ సెట్టింగ్‌లో ఎలాంటి మార్పులు జరిగాయో ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటం మంచిది. గమనిక: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫీచర్‌కు సంబంధించిన అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి.అయితే ఈ సెట్టింగ్ స్వయంచాలకంగా మళ్లీ ఆన్ అవుతోందన్న అంశంపై మెటా నుంచి అధికారిక నిర్ధారణ వెలువడలేదు.అందువల్ల వినియోగదారులు తమ ప్రైవసీ సెట్టింగ్‌లను తరచుగా పరిశీలించడం ఉత్తమం.