LOADING...
Sunita Williams: అంతరిక్షం నుంచి భూమిని చూసిన తర్వాత జీవితం పట్ల దృక్పథమే మారింది: సునీతా విలియమ్స్
అంతరిక్షం నుంచి భూమిని చూసిన తర్వాత జీవితం పట్ల దృక్పథమే మారింది: సునీతా విలియమ్స్

Sunita Williams: అంతరిక్షం నుంచి భూమిని చూసిన తర్వాత జీవితం పట్ల దృక్పథమే మారింది: సునీతా విలియమ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 21, 2026
06:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతరిక్షానికి వెళ్లడం తన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసిందని భారత మూలాలున్న వ్యోమగామి సునీతా విలియమ్స్ తెలిపారు. అంతరిక్షం నుంచి భూమిని ఒకే గ్రహంగా చూసిన అనుభవం... జీవితం పట్ల తన దృష్టికోణాన్ని పూర్తిగా మార్చిందని చెప్పారు. చిన్నచిన్న విషయాలపై మనుషుల మధ్య జరిగే గొడవలు, విభేదాలు ఇప్పుడు తనకు చాలా చిన్నగా, అర్థం లేనివిగా అనిపిస్తున్నాయన్నారు. దిల్లీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సునీతా విలియమ్స్‌... 'ఐస్ ఆన్ స్టార్స్, ఫీట్ ఆన్ ది గ్రౌండ్' అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె అంతరిక్ష ప్రయాణంలో ఎదురైన అనుభవాలను ఆసక్తికరంగా వివరించారు.

వివరాలు 

భూమి మొత్తం ఒకటే అన్న భావన

''అంతరిక్షానికి వెళ్లిన ప్రతీసారి... ముందుగా మన ఇల్లు ఎక్కడుందో వెతుకుతాం. నా తండ్రి భారతీయుడు, తల్లి స్లోవేనియాకు చెందినవారు. అందుకే మొదట ఆ రెండు ప్రాంతాలనే గమనించాను. తొలుత ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని గుర్తించాలనిపిస్తుంది. కానీ, కొద్దిసేపటికే భూమి మొత్తం ఒకటే అన్న భావన కలుగుతుంది. సముద్రాలు, కాలానుగుణ మార్పులు, ధృవ ప్రాంతాలు... అంతరిక్షం నుంచి ఈ గ్రహాన్ని చూసినప్పుడు అది నిజంగా అద్భుతంగా కనిపిస్తుంది. ఆ దృశ్యం మన జీవితంపై ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది'' అని ఆమె పేర్కొన్నారు.

వివరాలు 

చాలా విషయాలకు భయపడతా: సునీతా

అంతరిక్షం నుంచి భూమిని చూసిన అనుభవం మనుషుల మధ్య ఉన్న విభేదాలపై కూడా దృష్టిని మార్చుతుందని సునీతా విలియమ్స్ అన్నారు. మనమంతా ఒకే గ్రహానికి చెందినవారమే కాబట్టి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్న భావన కలుగుతుందన్నారు. ''ఒక గృహిణిగా కుటుంబంలో చిన్నపాటి వాదనలు ఎందుకు వస్తాయో నాకు తెలుసు. కానీ, అంతరిక్షం నుంచి భూమిని చూసిన తర్వాత అవన్నీ చాలా చిన్న విషయాలుగా అనిపిస్తాయి'' అని వ్యాఖ్యానించారు. ఎప్పుడైనా భయపడిన సందర్భాలున్నాయా? అనే ప్రశ్నకు స్పందిస్తూ... తాను చాలా విషయాలకు భయపడతానని నవ్వుతూ చెప్పారు. ముఖ్యంగా తాను నివసించే ప్రాంతంలో ఎలుగుబంట్లు ఉండటమే తనకు ఎక్కువ భయాన్ని కలిగిస్తుందని సరదాగా పేర్కొన్నారు.

Advertisement

వివరాలు 

నాసాలో 30 సంవత్సరాల పాటు సేవలందించిన సునీతా విలియమ్స్

నాసాలో దాదాపు 30 సంవత్సరాల పాటు సేవలందించిన సునీతా విలియమ్స్... గతేడాది డిసెంబర్ 27న పదవీ విరమణ చేశారు. తన కెరీర్‌లో మూడుసార్లు అంతరిక్షయానం చేసిన ఆమె... మొత్తం 608 రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో గడిపారు. ఈ ఘనతతో సుదీర్ఘకాలం అంతరిక్షంలో ఉన్న వ్యోమగాముల జాబితాలో ఆమె చోటు సంపాదించారు. ప్రస్తుతం ఆమె భారత్ పర్యటనలో ఉన్నారు.

Advertisement