Hyundai: ఫిఫా వేదికపై అట్లాస్ హ్యూమనాయిడ్ రోబోతో హ్యుందాయ్ ప్రదర్శన
ఈ వార్తాకథనం ఏంటి
2026 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా హ్యుందాయ్ తన హ్యూమనాయిడ్ రోబో అట్లాస్‌ను ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది. న్యూయార్క్/న్యూజెర్సీ స్టేడియంలో బ్రెజిల్-నార్వే మధ్య జరిగిన రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌కు ముందు ఈ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. వాస్తవ పరిస్థితుల్లో రోబోలు ఎంత సమర్థంగా పనిచేయగలవో చూపించడమే ఈ ప్రదర్శన ప్రధాన ఉద్దేశమని హ్యుందాయ్ తెలిపింది. పెద్దఎత్తున పరిశ్రమల్లో వినియోగానికి ముందు రోబోలు అనూహ్య పరిస్థితులకు ఎలా స్పందిస్తాయో పరీక్షించేందుకు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంది.
వివరాలు
తొలిసారి ప్రజల ముందుకు
హ్యుందాయ్ అనుబంధ సంస్థ బోస్టన్ డైనమిక్స్ అభివృద్ధి చేసిన రెండు కాళ్లపై నడిచే హ్యూమనాయిడ్ రోబో అట్లాస్ మ్యాచ్ ప్రారంభానికి ముందు అభిమానులను అలరించింది. ఫుట్‌బాల్ ఆటగాళ్ల తరహాలో సంబరాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనంతరం అధికారిక మ్యాచ్ బంతిని రిఫరీకి అందించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన సీఎస్‌ఈ (CES)ప్రదర్శనలో ఉత్పత్తికి సిద్ధమైన అట్లాస్‌ను హ్యుందాయ్ ఆవిష్కరించగా, ప్రజల ముందుకు రావడం ఇదే తొలిసారి. మ్యాచ్ ప్రారంభానికి ముందు అట్లాస్ ఆటగాళ్ల టన్నెల్ గుండా నడిచి మైదానంలోకి వచ్చింది. బ్రెజిల్ స్టార్ ఫార్వర్డ్ మాథియస్ కున్హా చేసే సర్ఫింగ్ సెలబ్రేషన్‌తో పాటు దక్షిణ కొరియా కెప్టెన్ సన్ హ్యూంగ్-మిన్ ప్రసిద్ధ కెమెరా పోజ్‌ను కూడా అచ్చం అనుకరించింది.
వివరాలు
'స్కూల్ ఆఫ్ ఫుట్‌బాల్'
దీంతో అభిమానులు ఆసక్తిగా వీక్షించారు. ఈ ప్రదర్శన హ్యుందాయ్ చేపట్టిన 'స్కూల్ ఆఫ్ ఫుట్‌బాల్' ప్రచార కార్యక్రమానికి ముగింపు ఘట్టంగా నిలిచింది. ఫుట్‌బాల్‌కు సంబంధించిన క్లిష్టమైన కదలికలను అట్లాస్ ఎలా నేర్చుకుందో ఈ ప్రచారంలో చూపించారు. 1999 నుంచి ఫిఫాకు స్పాన్సర్‌గా ఉన్న హ్యుందాయ్, ఈసారి టోర్నమెంట్ అధికారిక రోబోటిక్స్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ప్రయోగశాలలకే పరిమితం కాకుండా మారుతున్న పరిసరాలకు అనుగుణంగా హ్యూమనాయిడ్ రోబోలు ఎలా పనిచేయగలవో చూపించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని సంస్థ తెలిపింది.
వివరాలు
మార్పులకు అనుగుణంగా స్పందించేలా..
ఫుట్‌బాల్ మైదానంలో గడ్డి ఉపరితలం, అసమాన నేల, తక్కువ పట్టుదల వంటి అనేక సవాళ్లు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో అట్లాస్ సమతుల్యతను ఎలా కాపాడుకుంటుందో, తన కదలికలను ఎలా మార్చుకుంటుందో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు ఉపయోగపడతాయని బోస్టన్ డైనమిక్స్ రోబోటిక్స్ బిహేవియర్ డైరెక్టర్ అల్బెర్టో రోడ్రిగ్స్ చెప్పారు. వాస్తవ పరిస్థితుల్లో ఎదురయ్యే మార్పులకు అనుగుణంగా స్పందించేలా అట్లాస్ వివిధ కదలికలను నేర్చుకుని, వాటిని విశ్వసనీయంగా అనుకరించగలదని ఆయన వివరించారు.
వివరాలు
పెరుగుతున్న హ్యూమనాయిడ్ రోబోల వినియోగం
ఇలాంటి బహిరంగ ప్రదర్శనలు ప్రజలకు హ్యూమనాయిడ్ రోబోటిక్స్ భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన కల్పిస్తాయని రోడ్రిగ్స్ తెలిపారు. మొదట తయారీ రంగంలో, ఆ తర్వాత వచ్చే దశాబ్దంలో సాధారణ ప్రజల రోజువారీ జీవితంలో కూడా ఈ సాంకేతికత కీలక పాత్ర పోషించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే హ్యూమనాయిడ్ రోబోల వినియోగం పెరుగుతుండటంతో ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆటోమేషన్ కారణంగా కార్మికుల ఉపాధికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందని పలు కార్మిక సంఘాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.